మత్స్యశాఖ కమిషనరేట్ వద్ద ధర్నా న్యాయం చేయాలని డిమాండ్
పెనమలూరు: తమకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని కోరుతూ రొయ్యల సాగు రైతులు పోరంకిలోని రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీ రొయ్యల రైతుల సమైఖ్య రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి దుగ్గినేని గోపీనాధ్ విలేకరులతో మాట్లాడారు. రొయ్యల సాగు ద్వారా దేశానికి విదేశాల నుంచి ఆదాయం సమకూరుతుండగా, రొయ్యలసాగు రైతుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిందని ఆందోళణ వ్యక్తం చేశారు. ఆరునెలల్లో టైగర్ రొయ్య ఫీడ్ కేజీకి రూ.26, వేనామయ ఫీడ్ కేజీకి రూ 21 పెంచారన్నారు.పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. 45 రోజులకు ఒకసారి ఫీడ్ ధరలను సమీక్షించే పద్ధతిని రద్దు చేసి, ఏడాదికి ఒకసారి ధరలపై నిర్ణయం తీసుకోవాలన్నారు. పవర్ ఫ్యాక్టర్ షరతులతో సంబంధం లేకుండా రొయ్యల రైతులందరికీ యూనిట్ రూ.1.50 సబ్సిడీ అందచేయాలని కోరారు. టైగర్ రొయ్యల ధరలు 30 కౌంట్ కేజీ రూ.150, 20 కౌంట్ కేజీ ధర రూ.100 చొప్పున పతనమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం టైగర్ రొయ్యల ధరలను స్థిరీకరణ చేయాలన్నారు. రొయ్యల రైతులకు న్యాయం చేయని పక్షంలో ఆరునెలలు రొయ్యల పంట విరామానికి అనుమతించాలని కోరారు.
కమిషనర్‌కు వినతి...
ధర్నా అనంతరం రొయ్యలసాగు రైతులు మత్య్సశాఖ కమిషనర్ శంకర్‌నాయక్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఫీడ్ ముడిపదార్థాల ధరలు పెరిగినందునే ఫీడ్ ధరలు పెరిగాయని, అంతర్జాతీయ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా రొయ్యల ధరలు తగ్గాయన్నారు. 45 రోజులకు ఒకసారి ఫీడ్ ధరలు ఎలా పెంచుతారని కమిషనర్‌ను రైతులు ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మీరంతా నిజమైన రైతులేనా? అని కమిషనర్ ప్రశ్నించడంతో ఆయన తీరుపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


