ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి విజయవాడ, భీమవరంనకు చెందిన భక్తులు రూ.4లక్షలను విరాళాలుగా సోమవారం అందజేశారు. విజయవాడ రామచంద్రనగర్‌కు చెందిన వై.శివకుమారి కుటుంబం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది.శివకుమారి పేరిట రూ.లక్ష, నాగార్జుననగర్‌కు చెందిన జి.రామకృష్ణ పేరిట రూ. లక్ష, భీమవరంనకు చెందిన వి.శ్రీకాంత్‌వర్మ పేరిట రూ. లక్ష విరాళాన్ని ఆలయ ఈవో శీనానాయక్‌కు అందజేశారు. విజయవాడ గుణదలకు చెందిన పరిటాల దుర్గాప్రసాద్ కుటుంబం రూ.1,00,116 విరాళాన్ని అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందచేశారు.
సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఏలూరు కాలువలో దూకి గల్లంతైన యువకుడి మృతదేహాన్ని పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..కాజా గౌరీశంకర్(26) అనే యువకుడు కేదారేశ్వరపేటలోని పండ్లమార్కెట్‌లో ముఠా పనిచేస్తూ బ్రాహ్మణవీధిలోని తనఅక్క రౌతు లక్ష్మీ కుటుంబంతో ఉంటున్నాడు. జీతం డబ్బుల విషయంలో అక్క నిలదీయడంతో మనస్థాపానికి గురైన శంకర్ ఆదివారం మధ్యాహ్నం మీసాల రాజారావు వంతెన మీద నుంచి ఏలూరు కాలువలో దూకి గల్లంతయ్యాడు. ఎస్‌ఎన్‌పురం పోలీసులు సోమవారం ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలసి ఏలూరు కాలువలో గాలించగా జీఎస్ రాజురోడ్డు, పోలీస్ క్వార్టర్స్ వెనుక భాగాన కాలువలో అతని మృతదేహం లభ్యమైంది.
మధురానగర్(విజయవాడసెంట్రల్): మాచవరం ఎస్‌ఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల నియామకానికి 10నఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లూరు నీరజ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో కామర్స్, కంప్యూటర్ విభాగాలలో అధ్యాపక పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేయనున్నట్లు వివరించారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఆమె సూచించారు.


