రుణాల పేరుతో వల | - | Sakshi
Sakshi News home page

రుణాల పేరుతో వల

Sep 7 2026 7:45 AM | Updated on Sep 7 2026 7:45 AM

టీడీఎస్‌, ప్రాసెసింగ్‌ చార్జీలంటూ రూ.లక్షల్లో టోకరా

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాల పేరుతోనూ మోసం

నిరుద్యోగులను దోచుకుంటున్న

నకిలీ సంస్థలు

ఈజీ మనీకి.. కొత్త ఎత్తులు వేస్తున్న

సైబర్‌ నేరగాళ్లు

మోసపోతున్న వారిలో

విద్యావంతులే అధికం

తెలియని వ్యక్తితో ఫోన్‌ మాట్లాడినా ప్రమాదమే..

లబ్బీపేట(విజయవాడతూర్పు): సైబర్‌ నేరగాళ్లు పోలీసుల అంచనాలకు సైతం అందకుండా కొత్త ఎత్తులతో ప్రజలను చిత్తు చేస్తున్నారు. అసలు ఏ రూపంలో మోసగాళ్లు వస్తున్నారో తెలుసుకోవడం ఇప్పుడు పోలీసులకు పెద్ద చాలెంజ్‌గా మారింది. రుణాలు, పెట్టుబడులు, ఉద్యోగాల పేరిట ఇలా అనేక రకాలుగా ప్రజలను మోసం చేస్తున్న నేరగాళ్లు సులభంగా డబ్బులు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా జరుగతున్న సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. అంతేకాదు ఇటీవల సత్యనారాయణపురం పోలీసు స్టేషన్‌లో నమోదైన చీటింగ్‌ కేసు మాషా అల్లా కూడా ఇన్‌స్టా వేదికగా చేసిన ప్రచారంతోనే ప్రజలు మోసపోయినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

● మీ ఓటీపీ, సీవీవీ, పిన్‌, బ్యాంకు వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దు. ఒక చిన్న నిర్లక్ష్యం మీ జీవిత కాల పొదుపులను క్షణాల్లో కోల్పోయేలా చేస్తుంది.

● ఆన్‌లైన్‌లో అప్రమత్తంగా ఉండాలి. నకిలీ ఉద్యోగాలు, పెట్టుబడి ఆఫర్లు, అనుమానాస్పద లింకులు, తెలియని ఏపీకె ఫైల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలి.

● ఇన్‌స్ట్రాగామ్‌ వంటి సోషల్‌ మీడియాలో వచ్చే ప్రకటనలను నమ్మవద్దు.

● లోన్‌ యాప్‌ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తక్షణ లోన్‌ పేరుతో వచ్చే అనధికారిక యాప్స్‌ను నమ్మవద్దు. ప్రాసెసింగ్‌ ఫీజు, ఇన్సూరెన్స్‌ ఫీజు అంటూ ముందుగా చెల్లింపులు చేయవద్దు.

● ఒక్క క్లిక్‌ మీ ఫోన్‌ మొత్తం ప్రమాదంలో పడవచ్చు. ట్రాఫిక్‌ చలానా పేరుతో వచ్చే నకిలీ లింకులు, ఏపీకే ఫైల్స్‌ను నమ్మవద్దు.

● మొబైల్‌ పోయిన వెంటనే చర్యలు తీసుకోవాలి. మన ఫోన్‌లో ఉన్న బ్యాంకింగ్‌ వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం ఇతరుల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఫోన్‌ పోయిన వెంటనే సిమ్‌ బ్లాక్‌ చేయించి, సీఈఐఆర్‌ ద్వారా ఐఎంఈఐని బ్లాక్‌ చేయించాలి.

● కేవలం 15 నిమిషాల ఆలస్యం కూడా నష్టాన్ని పెంచవచ్చు.

కృష్ణలంక ప్రాంతానికి చెందిన యువతి ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం ఇన్‌స్ట్రాగామ్‌లో అన్వేషించడం మొదలు పెట్టింది. దానిలో ఉద్యోగ అవకాశాలు అనే ప్రకటన చూసి, వివరాలు తెలుసుకుంది. ఆమెకు ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగం ఇస్తానని నమ్మించి దాదాపు రూ.2 లక్షల వరకూ వసూలు చేసి మోసం చేశారు. ఇలా మోసగాళ్లు ఈజీమనీ కోసం కొత్త కొత్త ఎత్తులను ప్రజలను మోసం చేస్తున్నారు. ప్రజల అవసరాలను తెలుసుకుని ఏదో రూపంలో వారిని దోపిడీ చేస్తూ, మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నారు.

కంచికచర్ల ప్రాంతానికి చెందిన మహిళ.. తన భర్తకు గుండె వైద్యం కోసం రూ.10 లక్షల వరకూ అప్పుచేసి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. పిల్లలు కూడా చదువు పూర్తయినా ఉద్యోగాలు రాలేదు. ఇలాంటి తరుణంలో ఆమెకు ఒక తెలియని వ్యక్తి నుంచి ఫోన్‌ వచ్చింది. మీకు ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద రూ.50 లక్షల వరకూ రుణ మంజూరు అవుతుందని చెప్పారు. అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె.. అంత మొత్తం అవసరం లేదు. సగం ఇప్పించినా చాలని చెప్పి, వారు అడిగిన డాక్యుమెంట్స్‌ అన్నీ ఇచ్చింది. అప్పుడే అసలు కథ మొదలైంది. టీడీఎస్‌ ముందుగా చెల్లించాలని, ప్రాసెసింగ్‌ చార్జీలంటూ దాదాపు రూ.5 లక్షలకు పైగా ఆమె నుంచి వసూలు చేశారు. అనంతరం ఫోన్‌ కలవడం లేదు. దీంతో మోసపోయానని గ్రహించి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.

తెలియని వ్యక్తి నుంచి పంపిన లింక్‌లను క్లిక్‌ చేయకూడదు. అంతేకాదు తెలియని నంబర్ల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌తో మాట్లాడటం కూడా సురక్షితం కాదు. వీడియో కాల్స్‌ అసలు మాట్లాడవద్దు. ఇటీవల కాలంలో ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ వంటి వాటిలో ఆకర్షణీయమైన ప్రకటనలు వస్తున్నాయి. వాటిని క్లిక్‌ చేసే మీ హ్యాక్‌ అయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచుతాం, ఓటీపీ చెప్పమని ఫోన్‌ చేస్తుంటారు. అలాంటి వాటిని నమ్మొద్దు. డిజిటల్‌ అరెస్ట్‌ అనేది లేనే లేదు. ఏదైనా మోసపోయినట్లు గుర్తిస్తే వెంటనే 1930కి సమాచారం ఇవ్వండి.

– డి.చవాన్‌, ఇన్‌స్పెక్టర్‌, ఎస్‌ఆర్‌ పేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement