● బైక్‌ను మోపెడ్ ఢీ కొనడంతో రోడ్డుపై పడిపోయిన ప్రైవేట్ టీచర్ ● అతనిపై నుంచి వెళ్లిన ట్రాక్టర్.. చికిత్స పొందుతూ మృతి
కంచికచర్ల: ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడు తన తమ్ముడి పిల్లలను చూసేందుకు విజయవాడ వెళ్తుండగా కీసర గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై మృతి చెందిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ పి.విశ్వనాథ్ కథనం మేరకు జగ్గయ్యపేట హయత్‌నగర్‌లో నివాసముంటున్న దాసరి అనిల్ సుందర్(41) జగ్గయ్యపేట సమీపంలోని బోదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ పరిధిలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. ఆదివారం సెలవు రోజు కావటంతో విజయవాడలో ఉన్న తన తమ్ముడి పిల్లలను చూసేందుకు బైక్‌పై బయలుదేరాడు. కంచికచర్ల మండలం కీసర సమీపంలోకి రాగానే టీవీఎస్ మోపెడ్‌ను అడ్డదిడ్డంగా నడుపుతున్న వ్యక్తి బైక్‌ను ఢీ కొట్టాడు. దీంతో బైక్‌పై ఉన్న అనిల్ సుందర్ రోడ్డుపై పడిపోయాడు. అదే సమయంలో విజయవాడ వైపునకు వెళ్తున్న ట్రాక్టర్ అనిల్ సుందర్‌పై నుంచి వెళ్లింది. దీంతో అతడికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న నేషనల్ హైవే అంబులెన్స్ వాహన సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అనిల్ సుందర్ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య శ్రీలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహనాల వివరాలపై దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ చెప్పారు.


