భవానీపురం(విజయవాడపశ్చిమ): ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ అండ్ ఫుడ్ (ఐపీఎం) డైరెక్టర్ అరుణ్ బాబు ఆదేశాల మేరకు మూడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బెల్లం, తేనె నమూనాల సేకరణపై ఫుడ్ సేీఫ్టీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. అందులో భాగంగా శని వారం గొల్లపూడి పంచాయతీ పరిధిలో ఉన్న మహాత్మాగాంధీ హోల్‌సేల్ సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని ఇద్దరు ప్రముఖ బెల్లం వ్యాపారుల షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. రంగు కలిపిన బెల్లం ఉన్నదన్న అనుమానంతో దాదాపు 3,500 కేజీల స్టాక్‌ను సీజ్ చేశారు. ఈ బెల్లం శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం చైన్నెలోని ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా కోర్టు ఆదేశాల మేరకు తదనంతర చర్యలు తీసుకోనున్నారు. ఈ సంద ర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ.. మూడు రోజులుగా హోల్‌సేల్ కాంప్లె క్స్‌లో 15 వరకు బెల్లం శ్యాంపిల్స్ తీశామని, వాటిల్లో కేసు నమోదు చేయగలిగే విధంగా మూడు ఉన్నాయని తెలిపారు. ఈ మూడు రోజుల్లో సుమారు రూ.3 లక్షలు విలువ చేసే ఐదు వేల కేజీల బెల్లాన్ని సీజ్ చేశామని చెప్పారు. తాము సేకరించిన శ్యాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించామని, వాటిల్లో రంగు కలిసినట్లు రుజువైతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. కొందరు వ్యాపారులు స్వలాభంతో బెల్లంలో సల్ఫర్ వాడుతున్నారని అనుమానంగా ఉందన్నారు. సల్ఫర్ 100 పీపీఎం మించి వాడితే ప్రాణాలకు ప్రమాదమని, రంగు వేసిన బెల్లంతో క్యాన్సర్ (కార్సినోజెనిక్) వచ్చే ప్రమాదం ఉందని, ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం రంగులు వాడట నిషేధమని వ్యాపారులను హెచ్చరించారు.


