హనుమాన్‌జంక్షన్ రూరల్: పోలీస్ సబ్ ఇన్‌స్పె క్టర్‌ను అంటూ ద్విచక్ర వాహనదారుడి నుంచి దౌర్జన్యంగా డబ్బులు లాక్కున్న ఓ నకిలీ ఎస్‌ఐని హనుమాన్‌జంక్షన్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు వివరాలను హనుమాన్‌జంక్షన్ సీఐ ఎల్. రమణ, ఎస్‌ఐ ఎం.శ్రీవివాస్‌తో కలిసి శనివారం వెల్లడించారు. వారి కథనం మేరకు.. ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం వేలేరుకు చెందిన మాధవరపు సాంబయ్య తన బావమరిది సత్యనారాయణతో కలిసి ద్విచక్రవాహనంపై హనుమాన్‌జంక్షన్‌కు బయలుదేరాడు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో నకిలీ ఎస్‌ఐ సరిహద్దు దుర్గాంజనేయులు వారి వాహనాన్ని అడ్డుకున్నాడు. వాహనానికి నంబర్ ప్లేట్ లేనందున జరిమానా చెల్లించాలని బెదిరించాడు. నగదు ఇవ్వకపోతే కేసు నమోదు చేసి జైలుకు పంపుతామంటూ హెచ్చరించాడు. సాంబయ్య జేబులోని రూ.6 వేలను బలవంతంగా లాక్కున్నాడు. పోలీస్ యూనిఫాం లేకుండా ఓ వ్యక్తి రోడ్డుపై దౌర్జన్యం చేయటంపై అనుమానం వచ్చిన సాంబయ్య, సత్యనారాయణ తమ వద్ద డబ్బు లాక్కున్న దుర్గాంజనేయులను నిలదీశారు. దీంతో అతను వారిద్దరిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటనతో నిర్ఘాంతపోయిన సాంబయ్య హనుమాన్‌జంక్షన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి వెంటనే విచారణ చేపట్టిన హనుమాన్‌జంక్షన్ ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్ గన్నవరం రాయనగర్‌కు చెందిన సరిహద్దు దుర్గాంజనేయులు నకిలీ ఎస్‌ఐగా చెలామణీ అవుతూ వాహనదారులను బెదిరించి, డబ్బులు లాక్కుంటున్నట్లుగా గుర్తించారు. హనుమాన్‌జంక్షన్ శివారులోని వేలేరు క్రాస్‌రోడ్డు వద్ద శనివారం దుర్గాంజనేయులు ఉన్నట్లుగా సమాచారం అందటంతో తన సిబ్బందితో వెళ్లి పట్టుకున్నట్లు సీఐ రమేష్, ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్లు చెప్పారు.


