మెరక పేరిట మేసేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

మెరక పేరిట మేసేస్తున్నారు!

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

బుడమేరులో బుసక బూచోళ్లను అడ్డుకునేదెవరు? అడ్డుకోకపోతే అనర్థమే..

నిషేధం ఉన్నప్పటికీ ఇష్టారాజ్యంగా బుసక, ఇసుక తవ్వకాలు వెంచర్లకు తరలించి సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నాయకులు ప్రభుత్వ నిర్మాణాలకు నాణ్యతలేని బుడమేరు ఇసుక తరలింపు ట్రాక్టరు ట్రక్కు బుసక రూ.1000, ఇసుక రూ.2వేల వరకు విక్రయం గండ్లు పడే అవకాశం ఉందని రైతుల ఆందోళన కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం

అధికారులు నిద్రమత్తు వీడాలి..

బుడమేరులో బుసక బూచోళ్లను అడ్డుకునేదెవరు?

జి.కొండూరు: బుడమేరు ఉప్పెన గాయాలు ఇంకా మానకముందే టీడీపీ నాయకులు బుడమేరును చెరబడుతున్నారు. తవ్వకాలపై నిషేధం ఉన్నప్పటికీ బుడమేరునే ఆదాయ వనరుగా మార్చుకొని.. అడ్డూ అదుపూ లేని తవ్వేస్తూ.. సొమ్ము చేసుకుంటున్నారు. అధికారం మనదే.. ప్రజా ప్రతినిధి మనోడే.. అధికారీ మనోడే.. ఇక మనకి అడ్డేముంది అన్నట్లు సాగుతోంది బుడమేరులో బుసక, ఇసుక దందా. దీనిని అడ్డుకోవడానికి అధికారులకు మనసొప్పకపోవడంతో దందాలో అధికారుల పాత్రపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి.

యథేచ్ఛగా తవ్వకాలు..

బుడమేరులో ఇసుక, మట్టి కలిసి మెత్తటి బుసకగా ఏర్పడడమే అక్రమార్కులకు వరంగా మారింది. ఈ బుసకను రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లలో మెరక కోసం ఎక్కువగా వినియోగిస్తుండడంతో అక్రమార్కుల పంట పండింది. మైలవరం మండల పరిధి చండ్రగూడెం గ్రామ శివారులోని బుడమేరులో గత మూడు రోజులుగా రెండు పొక్లయిన్‌లతో బుసక తవ్వకాలు జరుపుతూ ముప్పై ట్రాక్టర్లతో సమీపంలోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ ఏర్పాటు కోసం మెరక చేసేందుకు తరలిస్తున్నారు. కట్టల వెంబడి, స్థానిక వంతెనకు సమీపంలో తవ్వకాలు చేస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బుసకను ట్రాక్టరు ట్రక్కు దూరాన్ని బట్టి రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. ఈ విధంగా వెలగలేరు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి ఎగువ బుడమేరు 42కిలోమీటర్లు మేర విస్తరించి ఉండడంతో ఈ పరీవాహక ప్రాంతంలోని గ్రామాలలో వెంచర్లతో పాటు ఎటువంటి వాణిజ్య అవసరాలున్నా టీడీపీ నాయకులు వెంటనే వాలిపోయి గత రెండేళ్లుగా తవ్వకాలు చేయడం పరిపాటిగా మారిపోయింది.

నిత్యం ఇసుక తవ్వకాలు..

బుడమేరులో ఎటువంటి ఇసుక రీచ్‌లకు అనుమతి లేకపోయినప్పటికీ టీడీపీ నాయకులు ఇసుక తవ్వకాలను నిత్యం కొనసాగిస్తూనే ఉన్నారు. సీసీ రోడ్లు, పక్కా డ్రెయిన్‌ల నిర్మాణం, వంతెనల నిర్మాణం, ప్రభుత్వ భవనాలు వంటి నిర్మాణాల్లో కృష్ణానది ఇసుకను వాడాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో బుడమేరు ఇసుకనే ఎక్కువగా వినియోగిస్తున్నారు. నిర్మాణాలు చేసే కాంట్రాక్టర్లు, ఇసుక రవాణాదారులు టీడీపీ నాయకులే కావడంతో నాణ్యతలేని బుడమేరు ఇసుక వినియోగానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ఈ విధంగా పుల్లూరు, చండ్రగూడెం, మైలవరం, చిన్ననందిగామ, కుంటముక్కల, వెల్లటూరు గ్రామాల పరిధిలో ఇసుక తవ్వకాలు రేయింబవళ్లు కొనసాగుతున్నాయి. ఒక్కొక్క ట్రాక్టరు ఇసుక దూరాన్ని బట్టి రూ.1500నుంచి రూ.2వేల వరకు కాంట్రాక్టర్లకు విక్రయిస్తున్నారు.

ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన బుడమేరులో బుసక, ఇసుక తవ్వకాలతో విధ్వంసం సృష్టిస్తుంటే అధికారులు కన్నెత్తి చూడకపోవడం దుర్మార్గం. గత చేదు అనుభవాలతోనైనా అధికారుల బుద్ధి మార్చుకోకపోతే రైతులే పోరాటానికి దిగుతారు. బుడమేరులో ఇదే తీరు కొనసాగితే కట్టలు కోతకు గురై ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.

– పీవీ ఆంజనేయులు,

రైతు సంఘం జిల్లా కార్యదర్శి

ఎన్టీఆర్‌ జిల్లాలోని ఏ.కొండూరు మండల పరిధి దుర్గం కొండల్లోని జమ్ములవోలు ప్రాంతంలో ప్రారంభమైన బుడమేరు వెలగలేరు హెడ్‌రెగ్యులేటర్‌ వరకు 42కిలోమీటర్లు మేర ఎగువన ప్రవహిస్తోంది. ఈ ప్రాంతంలో ఇప్పటికే బుడమేరు ఆక్రమణకు గురై వాగు వెడల్పు తగ్గిపోవడంతో పాటు గతంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేయడం వల్ల కట్టలు బలహీనపడి 2024 ఆగస్టులో వచ్చిన వరదలకు 80కిపైగా గండ్లు పడి తీవ్ర నష్టం వాటిల్లింది. మరలా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో రాత్రి, పగలు అనే తేడా లేకుండా బుడమేరులో తవ్వకాలు జరపడం ఇప్పుడు స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. కట్టల వెంబడి పొక్లయిన్‌లతో భారీ గోతులు పెట్టి తవ్వకాలు జరపడం వల్ల కట్టలు కోతకు గురై వరదల సమయంలో మరలా గండ్లు పడితే తీవ్ర నష్టం జరుగుతుందని పరీవాహక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement