కింగ్‌పిన్ సొహైల్ ఎక్కడ? జూన్ 11న తప్పించుకున్నా ఇప్పటి వరకూ జాడే లేదు పోలీసులపైనే దాడి చేసే స్థాయికి గంజాయి స్మగ్లర్లు తాజాగా పోలీసు కానిస్టేబుల్‌పై కత్తితో దాడి చేసిన నిందితుడు
గంజాయి ట్రాన్సిట్ కారిడార్‌గా విజయవాడ?
బరితెగిస్తున్న గంజాయి మాఫియా
సాక్షి ప్రతినిధి, విజయవాడ: గంజాయి నిర్మూలనకు కట్టుబడి ఉన్నాం.. గంజాయి రవాణాపై సమాచారం ఇస్తే ఐదు వేల రూపాయలు ఇస్తామంటూ ప్రభుత్వం, పోలీసులు ఊదరగొడుతున్నా.. వాస్తవ పరిస్థితి దానికి విరుద్ధంగా ఉంది. గంజాయి మాఫియా తెగబడుతోంది. ఆఖరికి పోలీసు కానిస్టేబుళ్ల మీదే కత్తితో దాడి చేసే పరిస్థితి వచ్చిందంటే గంజాయి మాఫియా ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల దగ్గర యర్నగూడెం గ్రామం వద్ద ఎన్‌హెచ్ సర్వీస్‌రోడ్డులో అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు బైక్‌లను ఆపి తనిఖీ చేస్తున్న సమయంలో కానిస్టేబుల్ వెంకటేశ్వరరావును కత్తితో పొడిచి పారిపోయారు. ఆ నిందితులు కంకిపాడు సమీపంలో ఉన్నట్లు వచ్చిన సాంకేతిక సమాచారం ఆధారంగా పోలీసులు కంకిపాడు మండలం కోమటికుంట లాకులు డొంకరోడ్డు వద్ద పట్టుకునే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా అఖిదాసరి అవినాథ్ అనే నిందితుడు కానిస్టేబుల్ శ్రీనివాస్ మీద కత్తితో ఛాతీపై దాడి చేశాడు. దీంతో కంకిపాడు సీఐ నిందితుడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటన ఉమ్మడి జిల్లాలో కలకలం రేపింది.
పోలీసుల నిర్లక్ష్యం..
ఒకవైపు వందల కిలోల గంజాయి రవాణా చేస్తూ ముఠాలు పట్టుబడుతుంటే.. మరోవైపు వాటి వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ను ఛేదించడంలో పోలీసుల దర్యాప్తు సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూన్ నెలలో పట్టుబడిన 140 కిలోల గంజాయి రవాణా కేసులో మహమ్మద్ సొహైల్ పేరు ప్రధానంగా తెరపైకి రావడం, అతడు పోలీసుల నిర్లక్ష్యం కారణంగా పటమట పోలీసు కస్టడీ నుంచి పరారు కావడం చర్చనీయాంశంగా మారింది. జూన్ నెల 9న తెల్లవారుజామున విజయవాడ శివారు నిడమానూరులో ఈగల్ బృందం ఓ లారీని తనిఖీ చేయగా, అందులో 140 కిలోల గంజాయి దొరికింది. లారీ డ్రైవర్లను విచారించగా తమిళనాడులోని కోయంబత్తూరుకు తరలిస్తున్నట్లు తేలింది. దీంతో ఈగల్ బృందం లారీని, ఇద్దరు డ్రైవర్లను పట్టుకుని విచారణ నిమిత్తం పటమట పోలీసులకు అప్పగించింది. ఈ నిందితులు ఇచ్చిన సమాచారంతో గంజాయి రవాణాకు కీలక సూత్రధారులైన కేరళకు చెందిన మహ్మద్ సొహైల్, ఒడిశాకు చెందిన అరూప్ సింగ్, రాజేష్‌కుమార్ సింగ్‌ను కూడా ఈగల్ అధికారులు విశాఖపట్నంలో పట్టుకుని పటమట పోలీసులకు అప్పగించారు. అయితే వీరిలో కింగ్‌పిన్ అయిన సొహైల్ జూన్ నెల 11న తెల్లవారుజామున పటమట పోలీసుల కళ్లు గప్పి వారి కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. సొహైల్‌ను ప్రవేశపెట్టకముందే పరారవడంతో పోలీసులు కంగుతిన్నారు. విషయం బయటకు పొక్కకుండా దాచారు. ఈ ఉదంతంపై సీపీ రాజశేఖర బాబు పటమట పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆ రోజు విధుల్లో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డును సస్పెండ్ చేశారు. అయితే ఇప్పటివరకూ సొహైల్‌ను పట్టుకోలేకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కిలోల కొద్దీ గంజాయి.. నగరానికి ఎలా చేరుతోంది?
ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలను కలుపుతూ గంజాయి రవాణా నెట్‌వర్క్ పనిచేస్తున్నట్లు కేసు వివరాల్లో ప్రస్తావించారు. నిడమానూరు వద్ద పట్టుబడిన 140 కిలోల గంజాయి కోయంబత్తూరుకు తరలిస్తున్నట్లు డ్రైవర్లు వెల్లడించినట్లు సమాచారం. ఇంత భారీ పరిమాణంలో గంజాయి నగర పరిధిలోకి వస్తుంటే పోలీసుల నిఘా వ్యవస్థ ఎక్కడ పనిచేస్తోంది? వాహనాలు నగరంలోకి ప్రవేశించే మార్గాలు, జాతీయ రహదారులు, బైపాస్‌లు, లాడ్జీలు, గోదాములు, రవాణా కేంద్రాలపై నిరంతర నిఘా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నప్పటికీ.. ఇలాంటి భారీ సరుకులు పట్టుబడుతున్న సందర్భాలు మాత్రం ఆ నిఘా వ్యవస్థలోని లోపాలను బయటపెడుతున్నాయి.
విజయవాడ భౌగోళికంగా కీలక రవాణా కేంద్రం. జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, అంతర్‌రాష్ట్ర రవాణా సౌకర్యాలు ఉండటంతో అక్రమ రవాణా ముఠాలకు నగరం ట్రాన్సిట్ పాయింట్‌గా ఉపయోగపడుతుందన్న వాదన వినపడుతోంది. గతంలోనూ విజయవాడ పరిధిలో భారీగా
గంజాయి పట్టుబడిన ఘటనలు నమోదయ్యాయి. 2025లో కృష్ణలంక పోలీసుల పరిధిలో ఈగల్ బృందంతో కలిసి పోలీసులు 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూడా
గంజాయిని లేకుండా చేస్తామని చెబుతున్నా వాస్తవంలోకి వచ్చేసరికి అంత చిత్తశుద్ధితో
ముందుకు వెళ్లడం లేదన్న వాదన వినిపిస్తోంది.


