యూపీహెచ్‌సీలో తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

యూపీహెచ్‌సీలో తనిఖీలు

Sep 5 2026 7:19 AM | Updated on Sep 5 2026 7:19 AM

యూపీహెచ్‌సీలో తనిఖీలు సమయపాలనలో విజయవాడ డివిజన్‌ కొత్త రికార్డు విజయవాడ ఉత్సవ్‌ ఏర్పాట్ల పరిశీలన నల్ల బ్యాడ్జీలతో ప్రభుత్వ వైద్యుల నిరసన

లబ్బీపేట(విజయవాడతూర్పు): నగరంలోని భవానీపురం 3వ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎన్టీఆర్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ ఎ. శ్రావణ్‌బాబు మంగళవారం సందర్శించారు. సిబ్బంది ముఖ ఆధారిత హాజరు, వారి పనితీరు, ప్రగతి నివేదికలను పరిశీలించారు. అవుట్‌ పేషెంట్‌ రిజిస్ట్రేషన్‌, ఆన్‌లైన్‌ ప్రగతి, అన్ని ఆరోగ్య కార్యక్రమాలపై వైద్యులు, సిబ్బందితో సమీక్ష చేశారు. అక్కడి ఫార్మసీని పరిశీలించి, త్వరలో కాలం చెల్లనున్న మందులు, అత్యవసర మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వ్యాధి నిరోధక టీకాల లభ్యత, వాటి భద్రత, ఐఎల్‌ఆర్‌ మెయింటేన్‌ చేయు విధానం, ఓపెన్‌ వయోల్‌ పాలసీ, కోల్డ్‌ చైన్‌ సిస్టమ్‌ నమోదు వంటి అంశాలను తనిఖీ చేశారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల ఆరోగ్య సమస్యలు అడిగి తెలుసుకుని, తక్షణ వైద్య సహాయం అందించాలని కోరారు.

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): రైళ్ల సమయ పాలనలో విజయవాడ డివిజన్‌ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఉన్న 90.80శాతం నెలవారి సమయపాలనను అధిగమించి ఆగస్టు నెలలో 91.28 శాతం నమోదు చేసుకుని సరికొత్త రికార్డు సాధించింది. ఈ అద్భుతమైన విజయం సాధించడం పట్ల డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా విజయవాడ డివిజన్‌ అధికారులు, సిబ్బందిని మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యోగుల సమష్టి కృషి, సమన్వయ ప్రయత్నాల వల్లే అద్భుతమైన సమయపాలన సాధ్యమైందన్నారు. అత్యంత రద్దీగా ఉండే రైలు మార్గాలలో సురక్షితమైన కార్యకలాపాలతో ప్రయాణికులకు సకాలంలో సేవలు అందించడంలో డివిజన్‌ నిబద్దత ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తి, అంకితభావంతో విధులు నిర్వర్తిస్తూ మెరుగైన ఫలితాలను లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.

భవానీపురం(విజయవాడపశ్చిమ): దసరా శరన్నవరాత్రులను పురస్కరించుకుని భవానీపురం పున్నమీఘాట్‌లో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్‌, సేల్స్‌ ఆఫ్‌ ఆర్టికల్స్‌ ఆఫ్‌ రూరల్‌ ఆర్టిజన్స్‌ సొసైటీ(సరస్‌) నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం పలువురు ప్రజాప్రతినిధులు పరిశీలించారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్‌ బాబు, ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ ఎస్వీ రాజశేఖర్‌ బాబు, విజయవాడ మునిసిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్ర, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్‌(చిన్ని) పున్నమీఘాట్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించడంతోపాటు గ్రామీణ కళాకారులు, చేతి వృత్తిదారులు, మహిళా స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించి విక్రయించుకునే అవకాశం కల్పించడమే విజయవాడ ఉత్సవ్‌, సరస్‌ ప్రధాన ఉద్దేశమని వివరించారు. సందర్శకులకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.

లబ్బీపేట(విజయవాడతూర్పు): రాష్ట్రంలోని బోధనాస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులకు 2016 యూజీసీ పీఆర్‌సీ బకాయిలు చెల్లింపుతో పాటు మరిన్ని సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ వైద్యులు మంగళవారం నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలిపారు. అంతేకాకుండా 30 నిమిషాల పాట నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్యుల సంఘం ఆంధ్రప్రదేశ్‌(జీడీఏ ఏపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమంలో పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ ఐ. బాబ్జి శ్యామ్‌కుమార్‌ మాట్లాడుతూ 2016 నుంచి 2021 వరకూ తమకు పనిచేసిన కాలానికి రావాల్సిన జీతభత్యాలు ప్రభుత్వం వద్ద బకాయి ఉన్నట్లు తెలిపారు. వాటిని చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. అసోసియేషన్‌ ఎస్‌ఎంసీ శాఖ అధ్యక్షురాలు డాక్టర్‌ జ్వలిత, కార్యదర్శి డాక్టర్‌ పి. అనీల్‌కుమార్‌, కోశాధికారి డాక్టర్‌ దుర్గారాణి, వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రత్నబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement