వాణిజ్య పన్నుల శాఖ అధికారుల పక్కదారి!
ఆదాయానికి భారీగా గండి తనిఖీలు చేయడం.. ఆపై మిన్నకుండటం పన్నులు వసూళ్లు కాకుండా అధికారులే అడ్డుకుంటున్నారని విమర్శలు
ఆన్‌లైన్ పేమెంట్‌లోనూ గందరగోళం..
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): రాష్ట్రంలో ఉమ్మడి కృష్ణాజిల్లాను వాణిజ్య రాజధానిగా పేర్కొనటం పరిపాటి. అత్యధిక ఆదాయం ఇక్కడ ఉన్న డివిజన్‌ల నుంచే ప్రభుత్వానికి లభిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. కానీ వస్తున్న ఆదాయానికి కొంతమంది అధికారులు అడ్డుపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారి వ్యవహార శైలి ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. వ్యాపారులతో అధికారులు కుమ్మకై ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల విషయంలో అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారనే వాదనలు ఆ శాఖ ఉద్యోగుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.
తూతూమంత్రంగా తనిఖీలు..
వాణిజ్య పన్నుల శాఖకు ఉమ్మడి కృష్ణాజిల్లాలో విజయవాడ డివిజన్–1, విజయవాడ డివిజన్–2, విజయవాడ డివిజన్–3 పేరుతో మూడు డివిజన్‌లు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో 17 సర్కిల్ కార్యాలయాలు పని చేస్తున్నాయి. మూడు డివిజన్‌లకు సంబంధించిన పరిధి దాదాపుగా విజయవాడల ఉంటుంది. వివిధ అంశాలపై కమిషనర్ ఆదేశాలకు అనుగుణంగా తరచుగా ఆయా వ్యాపార వర్గాలపై తనిఖీలు, ప్రత్యేక దాడులు నిర్వహిస్తుంటారు. కానీ అవన్నీ తుతూ మంత్రంగా నిర్వహిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. గడిచిన రెండేళ్లగా చేసిన తనిఖీల్లో గట్టిగా వాణిజ్య పన్నుల శాఖకు కట్టించిన దాఖలాలు లేవని ఉద్యోగులే వివరిస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది వ్యాపారులతో అధికారులతో కుమ్మకై ్క తమ చేతివాటంతో ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి చిల్లు పెడుతున్నారు.
ఇదో ఉదాహరణ..
విజయవాడలోని ఒక ప్రముఖ స్టార్ హోటల్‌పై డివిజన్–3 అధికారులు ఇటీవల ఆకస్మికంగా దాడి చేసి తనిఖీలు నిర్వహించారు. స్థానిక సర్కిల్ అధికారులు కాకుండా పక్క సర్కిల్ అధికారులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల వ్యవహారం జరిగేటప్పుడు హోటల్ వద్ద పెద్ద ఎత్తున హైడ్రామా కొనసాగింది. ఒక రాత్రంతా అధికారులు కాపలా కాసి తనిఖీలను విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం. హోటల్ నుంచి రికార్డులు తీసుకెళ్లినట్లు తెలిసింది. ఇది జరిగి 20 రోజులైనా ఇప్పటి వరకూ ఎటువంటి నోటీసు ఇవ్వలేదని అధికార వర్గాల నుంచి వినిపిస్తోంది. దాడులు చేసిన తరువాత వారితో ఏదైనా పంచాయతీ జరిగి ఉంటుందని, అందువల్లే నోటీసు సైతం ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది.
గతంలోనూ ఇదేతీరు..
గత డిసెంబర్ మాసాంతంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ బాబు అహ్మద్ సెలవులో ఉన్న సమయంలో స్పెషల్ కమిషనర్‌గా ఉన్న ఎన్. సౌమ్య ఆదేశాలతో విజయవాడ నగరంలోని సుమారు 20 నుంచి 25 రెస్టారెంట్‌లపై బృందాలుగా వెళ్లి ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ అధికారులు, సిబ్బంది అక్కడ ఉండి ఆ రెస్టారెంట్‌లో జరుగుతున్న వ్యాపారం, వాస్తవంగా కడుతున్న పన్ను, ఆన్‌లైన్ పేమెంట్ లేని రెస్టారెంట్‌ల తీరు తదితర పలు అంశాలను గమనించి ఆయా రెస్టారెంట్‌లకు నోటీసులు జారీ చేశారు. ఒక్కొక్క దానికి నాలుగు నుంచి రూ.40 లక్షల వరకూ జరిమానా విధిస్తూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. మొత్తం మీద రెండు నుంచి మూడు కోట్ల వరకూ తేడాగా ఉన్న పన్ను, జరిమానాలు విధించినట్లు తెలిసింది. అయితే అందులో కొద్దిమంది మాత్రమే స్పందించారని, అది కూడా చాలా స్వల్పంగా చెల్లింపు చేశారని, మిగిలిన వారు పంచాయితీలతో సరి చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఆర్‌వో కార్యాలయంపైనా విమర్శలు..
వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాతో పాటుగా మరో రెండు జిల్లాల్లో టర్నోవర్‌ను బట్టి అధికంగా ఉన్న కేసులను విజయవాడలోని రీజనల్ కార్యాలయం పర్యవేక్షిస్తుంది. ఆ శాఖ అడిషనల్ కమిషనర్ పర్యవేక్షణలో ఈ కార్యాలయం పని చేస్తుంది. అయితే రెస్టారెంట్‌ల వ్యవహారంలోనూ పలు అంశాలను ఈ కార్యాలయం అధికారులు పరిశీలించారనే వాదనలు ఉన్నాయి. అలాగే ఈ కార్యాలయం ఇప్పటి వరకూ పెద్దగా ఎటువంటి కేసులు ఛేదించిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. అటు సర్కిల్ కార్యాలయాల నుంచి ఇటు ఆర్‌వో కార్యాలయాల వరకూ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది.
నగరంలోని కొన్ని రెస్టారెంట్‌లు ఆన్‌లైన్ పేమెంట్‌లలో ప్రభుత్వానికి మస్కా కొడుతున్నాయనే అంశాలు ఈ దాడుల్లో బయటపడ్డాయి. సాధారణంగా ఒక వ్యాపార సంస్థ అధికారికంగా ఒక బ్యాంక్ ఖాతాను నిర్వహించటం దానికి ఆన్‌లైన్ పేమెంట్‌లు చేయించటం జరగాలి. కానీ ఒక రెస్టారెంట్ ఐదారు ఖాతాలకు యూపీఏ పేమెంట్‌లు చేయించటాన్ని అధికారులు కనుగొన్నారు. అలాగే ఒక రెస్టారెంట్ అయితే అసలు ఆన్‌లైన్ పేమెంట్ లేకుండా కేవలం నగదు చెల్లింపులను మాత్రమే నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. వారిద్దరికీ భారీగా పన్ను తేడాలు, జరిమానాలు విధించారు. అయితే వారి నుంచి ఎంత మేర చెల్లింపు చేశారనే విషయం ఇప్పటి వరకూ తేలలేదు.


