డ్రైవర్‌ను హత్య చేసిన క్లీనర్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

డ్రైవర్‌ను హత్య చేసిన క్లీనర్‌ అరెస్ట్‌

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

పెనమలూరు: కానూరులో లారీ డ్రైవర్‌ను హత్య చేసిన ఘటనలో లారీ క్లీనర్‌ను అరెస్ట్‌ చేశామని డీఎస్పీ కె.ధర్మేంద్ర తెలిపారు. ఆయన పెనమలూరు పోలీస్‌స్టేషనల్‌లో గురువారం వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌కు చెందిన లారీ డ్రైవర్‌ ఆనంద్‌సర్కార్‌(50) లారీ మరమ్మతుల కోసం కానూరు నవతారోడ్డులో ఉన్న రమణ షెడ్డుకు గత నెల 5వ తేదీన వచ్చాడు. అతను లారీ మరమ్మతులు చేయించుకుంటూ అక్కడే ఉంటు న్నాడు. అయితే అదే లారీకి క్లీనర్‌గా బెంగాల్‌ రాష్ట్రానికి చెందిన సంజయ్‌హల్దార్‌ (36) ఆగస్టు 19వ తేదీన వచ్చాడు. అయితే ఈ నెల 30వ తేదీ రాత్రి ఇద్దరు మద్యం తాగారు. అనంతరం వారి మధ్య గొడవ మొదలయింది. దీంతో లారీ క్లీనర్‌ సంజయ్‌హల్దార్‌ ఇనుప రాడ్‌తో డ్రైవర్‌ ఆనంద్‌ సర్కార్‌పై విచక్షణా రహితంగా దాడి చేయటంతో అతని మృతి చెందాడు. లారీ షెడ్డు యజమాని రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు సంజయ్‌హల్దార్‌ను అరెస్టు చేశారు.

యజమానుల వద్ద వివరాలుండాలి..

మద్యం తాగిన వారు విచక్షణ కోల్పోరాదని డీఎస్సీ ధర్మేంద్ర తెలిపారు. ఈ ఘటన కేవలం మద్యం సేవించిన తరువాత చిన్న వివాదం కారణంగానే హత్య జరిగిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పని చేసే వారి వివరాలు యజమానుల వద్ద ఉండాలన్నారు. ఆధార్‌కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే గుర్తింపు పత్రాలు యజమానులు తీసుకోవాలన్నారు. కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్లు కూడా ఉంచుకోవాలని సూచించారు. బెంగాల్‌కు చెందిన నిందితుడు సంజయ్‌హల్దార్‌ ఆచూకీ తెలుసుకుని అరెస్టు చేసినందుకు సీఐ వెంకటనారాయణ, ఎస్‌ఐలు సత్యసుధాకర్‌, రమేష్‌, వెంకటేశ్వరరావును జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అభినందించినట్లు డీఎస్పీ ధర్మేంద్ర తెలిపారు.

వివరాలు వెల్లడించిన డీఎస్పీ ధర్మేంద్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement