దుర్గమ్మ భక్తురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ భక్తురాలి మృతి

Sep 4 2026 2:12 AM | Updated on Sep 4 2026 2:12 AM

దుర్గమ్మ భక్తురాలి మృతి

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన భక్తురాలు మహా మండపం రెండో అంతస్తులో అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో భక్తురాలిని దేవస్థాన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఆ ఘటన గురువారం చోటు చేసుకుంది. పెనమలూరు మండలం తాడిగడపకు చెందిన కె. పద్మ(61), తన భర్త నాంచారయ్యతో కలిసి గురువారం అమ్మవారి దర్శనానికి విచ్చేసింది. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అన్న ప్రసాదం స్వీకరించేందుకు మహామండపం రెండో అంతస్తులో దింపాలని లిఫ్టు సిబ్బందికి కోరింది. అయితే గ్రౌండ్‌ప్లోర్‌లో దింపిన సిబ్బంది.. అక్కడి నుంచి మెట్లపై రెండో అంతస్తుకు వెళ్లాలని సూచించారు. అయితే మెట్లు ఎక్కే క్రమంలో పద్మ తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ క్రమంలో ఆలయ సిబ్బంది వెంటనే పద్మను గ్రౌండ్‌ ఫ్లోర్‌లో దింపి, అక్కడి నుంచి దేవస్థాన అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మార్గమధ్యలో పద్మ మృతి చెందగా.. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమ నివాసానికి తీసుకెళ్లినట్లు ఆలయ సిబ్బంది పేర్కొంటున్నారు. ఘటనపై వన్‌టౌన్‌ పోలీసులకు బాధితులు ఫిర్యాదు ఇవ్వలేదని తెలుస్తోంది.

ఎందుకిలా?

కనీసం వృద్ధులు, వికలాంగులను అన్నదానం జరిగే ఫ్లోర్‌లో లిఫ్టు ద్వారా దింపాలని కొంత కాలంగా డిమాండ్‌ చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్ర, శని, ఆదివారాలలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే మహా మండపం ఎదుట నూతనంగా నిర్మించిన అన్నదాన భవనంలో అన్న ప్రసాద వితరణను ప్రారంభిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందని మరి కొంత మంది భక్తులు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement