మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): కేరళంలోని త్రివేండ్రంలో ది నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న 17వ సౌత్ జోన్ షూటింగ్ చాంపియన్‌షిప్–2026లో నగరానికి చెందిన షూటర్లు ప్రతిభ చూపి వివిధ విభాగాల్లో 8 పతకాలు పొందారు. ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్‌కు చెందిన నాగిశెట్టి జాహ్నవి ప్రతిభ కనపరచి 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, ఫైర్ ఆర్మ్స్, సీనియర్, జూనియర్, యూత్ మహిళల విభాగాల్లో మూడు కాంస్య పతకాలు కై వసం చేసుకుంది. కొసన పూర్ణిమ శ్రీనివాస్ 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో సీనియర్, జూనియర్, యూత్ విభాగాల్లో మూడు రజత పతకాలు సొంతం చేసుకుంది. ఏడూరు శ్రీకర జయంత్ రెడ్డి 25 మీటర్ల జూనియర్, యూత్ మెన్ విభాగాల్లో రెండు రజత పతకాలను గెలుచుకున్నాడు. పతకాలు పొందిన షూటర్లను ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్స్ డైరెక్టర్, చీఫ్ కోచ్ నాగిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు అభినందించారు. ఆగస్టు 31వ తేదీన మొదలైన ఈ చాంపియన్‌షిప్ ఈ నెల 8వ తేదీ వరకు జరుగుతుంది.


