బుడమేరు వరదలు వచ్చి.. రెండేళ్లయినా శాశ్వత పరిష్కార చర్యలు శూన్యం నాడు వరద బాధితులను ఆదుకోవడంలో.. నేడు బుడమేరును పరిరక్షించడంలో తీవ్ర నిర్లక్ష్యం..
కూటమి ప్రభుత్వానిది నేరపూరిత నిర్లక్ష్యం
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ నగరాన్ని బుడమేరు వరదలు ముంచెత్తి సరిగ్గా నేటి రెండేళ్లు. 2024 సెప్టెంబర్ 1వ తేదీ బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో నగరంలోని పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కొందరైతే.. మరికొందరు ఇళ్లు, విలువైన వస్తువులు, వాహనాలు కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు.
ఆది నుంచి నిర్లక్ష్యమే
బుడమేరు వరదలు సంభవించిన దగ్గర నుంచి నేటి వరకూ కూటమి ప్రభుత్వం అదే నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తోంది. ఆగస్టు 31వ తేదీ 2024వ తేదీనే బుడమేరు కట్ట తెగి వరద నీరు బెజవాడ నగరానికి చేరుతోందని తెలిసినప్పటికి నగరంలోని లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైంది. సెప్టెంబర్ 1వ తేదీ ఇంకా కళ్లు తెరిచి నిద్రలేవకముందే వరద నీరు వందల ఇళ్లను ముంచెత్తేశాయి. దీంతో పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ఆ వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోగా.. లక్షల మంది ప్రజలు సర్వం కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు. ప్రభుత్వం ముందుగానే ప్రజలను అప్రమత్తం చేసి ఉంటే ప్రాణనష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా చాలా వరకూ తగ్గడంతో పాటు బాధితులు సురక్షిత ప్రాంతాలకు చేరేవారు. నాడు ముంపు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో.. వరద బాధితులను ఆదుకోవడంతో పాటు బుడమేరును పరిరక్షించడంలో కూడా నేటికి ప్రభుత్వం అదే నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తోంది.
విచ్చలవిడిగా బుడమేరు ఆక్రమణలు
ఇంత పెద్ద ఎత్తున్న విపత్తు నెలకొన్నా.. లక్షలమంది ప్రజల జీవితాలు రోడ్డున పడినా కూటమి ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టయినా లేకుండా పోయిందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. నాడు వరదల సమయంలో బుడమేరు ప్రక్షాళన చేస్తామని.. ఆక్రమణలను తొలగిస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నేటికి వాటిని ఆచరణలో పెట్టలేదు.
బుడమేరు పరిరక్షణకు చర్యలు కాదు కదా కనీసం కొత్తగా బుడమేరులో ఆక్రమణలను కూడా అడ్డుకోవడంలో విఫలమవుతుంది. బుడమేరు వరదల తర్వాత న్యూఆర్‌ఆర్‌పేట, సన్‌సిటీ కాలనీ, ఇందిరానాయక్‌నగర్, రామకృష్ణాపురం, దేవినగర్, బుడమేరు కట్ట ప్రాంతాల్లో ఆక్రమణలు మరింతగా పెరిగిపోయాయి. ఇప్పటికై నా ప్రభుత్వం బుడమేరు విషయంలో మొద్దునిద్రను వీడి.. బుడమేరు పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని.. ఇరువైపులా వారధి మాదిరిగా రిటైనింగ్ వాల్‌ను నిర్మించాలని నగర ప్రజలు, నాయకులు కోరుతున్నారు.
బుడమేరు ముంపు నివారణలో కూటమి ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్య ధోరణిని వ్యవహరిస్తోంది. బుడమేరు ముంపు రాకుండా శాశ్వత చర్యలు తీసుకుంటామని స్వయాన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికి శూన్యంగానే ఉండటం సిగ్గుచేటు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం బుడమేరు ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలి.
– కె.దుర్గారావు, సీపీఎం నేత


