అంతరంగంలోని ఎవరెస్ట్‌ను జయించండి. అప్పుడు ఏ పర్వతమూ అధిరోహించలేనిది కాదు.
ట్రెక్కింగ్‌కు స్వర్గధామంగా కొండపల్లి ఫారెస్ట్
ఎటు చూసినా తివాచీలా పరుచుకున్న పచ్చదనం... ప్రకృతి రమణీయమైన అందాలు... పక్షుల కిలకిలలు... సెలయేళ్ల గలగలలు... సవాలు చేసే ఎత్తయిన శిఖరాలు... అందమైన లోయలు... పురాతన చరిత్రకు సాక్షీభూతాలుగా నిలిచే కోట బురుజులు... జలపాతాలు... కోనేరులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసే దృశ్యాలు... ఇవన్నీ ఎక్కడో కాదండోయ్... విజయవాడ నగరానికి అతి సమీపంలో ఉన్న కొండపల్లి ఖిల్లాపైనే... వారాంతపు సెలవుల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలసి సేద తీరడానికి కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ సరైన గమ్యస్థానం. ఇక ట్రెక్కింగ్‌కు ఇంతకంటే మంచి వేదిక మరెక్కడుంటుంది...
– ఎవరెస్ట్ అధిరోహకుడు ఎడ్మండ్ హిల్లరీ
ఇబ్రహీంపట్నం: విజయవాడ నగరానికి సమీపంలో ఇబ్రహీంపట్నం, జి.కొండూరు, నందిగామ, కంచికచర్ల మండలాల పరిధిలో సుమారు 28 వేల ఎకరాల్లో విస్తరించిన కొండపల్లి ఫారెస్ట్ ట్రెక్కింగ్ ప్రియులకు స్వర్గధామం అని చెప్పవచ్చు. అడవిలో ఫిరంగులు, సొరంగ మార్గాలు, రాతి శిలలు, జలపాతాలు యువతీ యువకులు, క్రీడాకారులు, విద్యార్థులను ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్ సమయంలో అవగాహన లోపంతో కొందరు ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. పచ్చని అందాలు ఓవైపు, ప్రకృతి సోయగాలు మరోవైపు సహజ సిద్ధంగా వెలిసిన కొండలు ఇంకొక వైపు. ఈమూడింట నడుమ ట్రెక్కింగ్ నిర్వహించడం సాహసమే. కొండపల్లి ఖిల్లా, రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎత్తయిన కొండ ప్రాంతాలు, పశుపక్ష్యాదులు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్‌లో ఐదేళ్ల చిన్నారుల నుంచి 50 ఏళ్ల వయస్సు గల ఎవరైనా పాల్గొనవచ్చు. విజయవాడ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి సైతం రిజర్వ్ ఫారెస్ట్‌కు చేరుకుని ట్రెక్కింగ్ నిర్వహిస్తుంటారు. ఇక్కడ ఎత్తయిన ఒంటిమిట్ట కొండ పైకి ట్రెక్కింగ్ చేస్తే విజయవాడ నగరం మొత్తం కనిపిస్తుంది.
కొండపల్లి ఫారెస్ట్ ప్రకృతి ప్రేమికులకు వరం
కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో వారసత్వ సంపద సాహస క్రీడలకు వేదికగా మారింది. ఎత్తయిన కొండలు, జలపాతాలు వారసత్వ కట్టడాలు ముళ్ల పొదలతో కూడిన ఫారెస్ట్ ట్రెక్కింగ్‌కు అనువైనదిగా 2018లో గుర్తించడంతో ప్రకృతి ప్రేమికులకు వరంగా మారింది. ఖిల్లా నుంచి కుడి ఎడమల వైపు సుమారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో రాతి శిలలు ట్రెక్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి. వీటితో పాటు నెమలిధార, మావుళ్లమ్మ తీర్థం, బేబీ చిత్రకూట్, కొంగుధార, వనమాలి, చిట్టితుంబరఽ ధార, సప్త స్వరధారలు, కుడి ఎడమల జలపాతాలు దర్శనమిస్తాయి.
ఫారెస్ట్‌లో రాచరికపు ఆనవాళ్లు
కొండపల్లి ఫారెస్ట్‌లో ఏమూలన ట్రెక్కింగ్ ప్రారంభించినా అడవి మధ్యలో ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన కోటకు చేరుకుంటారు. కోట పరిసరాల్లో పూర్వం నిర్మించిన 13 బురుజులు ట్రెక్కింగ్ ప్రియులకు ఆహ్వానం పలుకుతాయి. కోటలోనే కాకుండా ఆటవీ ప్రాంతంలో యుద్ధ సమయాల్లో వినియోగించే ఫిరంగిని యూత్ హాస్టల్ అసోసియేషన్ క్లబ్ కార్యదర్శి విష్ణువర్థన్ బృందం గుర్తించింది. దీనితో పాటు అనేక వారసత్వ కట్టడాలు వెలుగులోకి వచ్చాయి.
ట్రెక్కింగ్‌లో రకాలు
తాడును నడుముకు కట్టుకుని ఎత్తయిన కొండపై నుంచి కిందికి దిగడాన్ని రాఫ్లింగ్ అంటారు. తాడు నడుముకు కట్టుకుని చేతితో కొండ రాళ్లను పట్టుకుని కొండ పైకి పాకడాన్ని రాక్ క్‌లైంబింగ్, తాడును చేతులతో పట్టుకుని కొండపైకి ఎగబాకుతూ వెళ్లడాన్ని జుమ్మెరింగ్‌గా పిలుస్తారు. విద్యార్థులు, మహిళలు కొండ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్లడాన్ని ట్రెక్కింగ్ అంటారు. రెండు కొండల మధ్య కట్టిన తాడుకు వేలాడుతూ వెళ్లే సాహస క్రీడను జిప్‌లైన్, రెండు చెట్ల మధ్య ఏర్పాటు చేసిన దృఢమైన వలను పట్టుకుని చిన్నారులు పైకి ఎక్కే క్రీడను కమెండో నెట్ అంటారు. కొండపై నుంచి బెలూన్‌లో ఉంటూ కిందకు దొర్లి వచ్చే సాహస క్రీడను జోర్పింగ్‌గా పిలుస్తారు. అడవిలోని వివిధ ప్రాంతాల్లో కనిపించకుండా దాచిన వస్తువులను గుర్తించడాన్ని ట్రెజర్ హంట్ అంటారు.
ట్రెక్కింగ్‌పై పర్యవేక్షణ కరువు
రిజర్వ్ ఫారెస్ట్‌లో ఎత్తయిన కొండలపై సాహసంతో కూడుకున్న ట్రెక్కింగ్‌పై అధికారుల పర్యవేక్షణ కరువైంది. ట్రెక్కింగ్‌కు ఎవరు, ఎప్పుడు, ఎటువైపు వెళ్తున్నారు, వారు తిరిగి కిందకు చేరారా లేదా అనే పర్యవేక్షణ కరువైంది. కొన్ని సందర్భాల్లో ట్రెక్కింగ్ ప్రియులు దారితప్పి ఆందోళనకు గురవుతున్నారు. ఈనెల 20న ఖిల్లాకు వెళ్లిన నలుగురు యువకులు ట్రెక్కింగ్‌కు వెళ్లి దారి తప్పారు. రాత్రి వేళ అడవిలో చిక్కుకుని తప్పనిసరి పరిస్థితుల్లో పోలీసులకు ఫోన్ చేశారు. రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు వారి ఆచూకీ కనుగొని సురక్షితంగా ఇళ్లకు చేర్చారు.
ట్రెక్కింగ్‌తో యువతీ యువకుల్లో ధైర్య సాహసాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ట్రెక్కింగ్ చేయగలిగిన వారు జీవితంలో ఎదురయ్యే ఎటువంటి ఒడుదొడుకులైనా సమర్థంగా ఎదుర్కోగలుగుతారు.
– ఎవరెస్ట్ అధిరోహించిన మొట్టమొదటి భారతదేశ మహిళ బచేంద్రిపాల్
ఖిల్లా, ఎత్తయిన కొండలు
ట్రెక్కింగ్ ప్రియులకు అనుకూలం
నిబంధనలు
పాటించకపోతే
ప్రమాదకరం
పూర్తి అవగాహన ఉన్న గైడ్‌ను
వెంట తీసుకువెళితే మంచిది


