ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):
ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి శనివారం పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. విజయవాడ పటమటకు చెందిన ఎస్.ఉమామహేశ్వరరావు, కళావతి దంపతులు రూ.1,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన కూనపురెడ్డి దీప్తిశ్రీ, తేజస్వంత్ దంపతులు నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.
మైలవరం: ఆంధ్రప్రదేశ్ ఫుట్‌బాల్ అసోసియేషన్(ఏపీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో మైలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి స్టేడియంలో జరుగుతున్న సీనియర్ మెన్–2026 ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ రెండో రోజు శనివారం 11 లీగ్ మ్యాచ్‌లు విజయవంతంగా పూర్తయ్యాయి. అనంతరం జరిగిన క్వార్టర్ ఫైనల్–1 శ్రీకాకుళం–ఈస్ట్ గోదావరి జట్ల మధ్య ఆద్యంతం హోరాహోరీగా జరిగింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 0–0తో సమంగా నిలవడంతో విజేతను నిర్ణయించేందుకు టైబ్రేకర్ నిర్వహించారు. టైబ్రేకర్‌లో ఈస్ట్ గోదావరి జట్టు 5–4 తో శ్రీకాకుళంపై విజయం సాధించి సెమీ ఫైనల్స్ చేరుకుంది. క్వార్టర్ ఫైనల్–2 లో 1–0తో నెల్లూరుపై తిరుపతి విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకుంది.
ఇంటర్నెట్‌లో సెర్చ్.. రూ.6.25లక్షలకు టోపీ
పటమట(విజయవాడతూర్పు): ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్‌లో తమకు కావాల్సిన మిషనరీని వెతికిన ఓ సంస్థకు రూ.6.25 లక్షలకు కుచ్చుటోపీ పెట్టారు. దీనిపై పటమట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎనికేపాడులోని విజయ ఆగ్రో ప్రోడక్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న సీహెచ్ దుర్గా రవీంద్రనాఽథ్ సంస్థకు వినుకొండలో ఉన్న పామాయిల్ నర్సరీకి 40 కేవీ డీజిల్ జనరేటర్ కోసం ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్‌లో వెతికారు. రవీంద్రనాఽథ్ ఇచ్చిన వివరాల మేరకు విశాఖపట్నంలోని ఎస్‌డీఎల్ ఎంటర్‌ప్రైజర్ డీజిల్ జనరేటర్ సప్లయర్ సంస్థ ప్రతినిధిగా నిరంజన్ అనే వ్యక్తి సంప్రదించి జనరేటర్ రూ.6.35 లక్షలు ఉందని, దీన్ని తాము 6.25 లక్షలకు ఇస్తామని ఫోన్‌లో ఒప్పదం కుదుర్చుకున్నారు. ఈ మేరకు జూలై 8న రూ.లక్ష, 22న 5.25 లక్షలు చెల్లించి వినుకొండలోని తమ నర్సరీలో డెలివరీ చేయాలని రవీంద్రనాథ్ సూచించారు. పేమెంట్ జరిగి నెలరోజులైనా ఇంకా డెలివరీ రాకపోవటంతో నిరంజన్‌కు ఫోన్ చేయగా జనరేటర్ల కొరత ఉందని ఒకసారి, తనకు ఆరోగ్యం బాగాలేదని మరోసారి కారణాలు చెబుతూ వచ్చాడు. ఫోన్ చేస్తే స్పందించటం మానేయటంతో ఎస్‌డీఎల్ ఎంటర్‌ప్రైజెస్ దానికి సప్‌లై చేసే లెజెండ్ పవర్ సొల్యూషన్స్‌ను సంప్రదించగా నిరంజన్ అనే వ్యక్తి ఈ రెండు సంస్థల్లో పనిచేయటంలేదని ఆయా సంస్థల నుంచి రిప్లయి వచ్చింది. తాము పంపిన నగదును నిరంజన్ తన వ్యక్తిగత ఖాతాకు బదిలీ చేయించుకుని తనను మోసం చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని రవీంద్రనాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పటమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉంగుటూరు(గన్నవరం): మండల కేంద్రమైన ఉంగుటూరుతో పాటు పరిసరర గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించిన దొంగ ఎట్టకేలకు చిక్కినట్లు సమాచారం. పది రోజుల క్రితం ఉంగుటూరులో జరిగిన ఓ చోరీ కేసులో బాధితుల అనుమానం మేరకు ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించండంతో చోరీల గుట్టు రట్టయింది. వివరాలిలా వున్నాయి. గత ఆరు నెలల వ్యవధిలో ఉంగుటూరుతో పాటు కొయ్యగూరపాడు, నందమూరు పరిసర గ్రామాల్లో 12కు పైగా చోరీలు జరిగాయి. సుమారు రూ.రెండు కోట్లకు పైగా సొత్తు అపహరణకు గురైంది. ఈ వరుస చోరీలతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఉంగుటూరు పోలీసులతో పాటు ప్రత్యేక నిఘా బృందాలతో గస్తీ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఉంగుటూరులోని ఆర్‌ఎంపీ వైద్యుని ఇంటిలో ఈ నెల 21న జరిగిన చోరీ ఘటనకు సంబంధించి ఫిర్యాదుదారుడు ఓ షామియానా దుకాణ యాజమాని కుమారుడిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆతని కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారంతో అతనిని వారం రోజుల క్రితం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఉంగుటూరు పరిసర గ్రామాల్లో ఆతనే చోరీలకు పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయినట్టు సమాచారం. ఆతని నుంచి చోరీకి గురైన సొత్తును రికవరీ చేసే ప్రయత్నంలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో టెంట్‌లు వేసేందుకు వెళ్లి రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇళ్లు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని అతను చోరీలకు పాల్పడడం ప్రవృత్తిగా ఎంచుకున్నాడు. గత కొన్ని నెలలుగా వరుస చోరీలతో ఉంగుటూరు పరిసర గ్రామాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన దొంగ ఎట్టకేలకు దొరకడంతో బాధితులు పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు.


