గత ప్రభుత్వంలో ఇలా.. !
కూటమి ఏర్పడిన రెండున్నరేళ్ల తర్వాత పెన్షన్ ఇస్తామంటూ ఆర్భాటం
‘స్థానిక’ ఎన్నికల వేళ వెంటాడుతున్న ఓటమి భయం
పింఛన్ ఇవ్వడానికి రెండున్నరేళ్లు పడితే.. ఆడబిడ్డ నిధి.. నిరుద్యోగ భృతి ఎప్పుడో ?
జిల్లాలో పింఛన్ కోసం వేలాదిగా దరఖాస్తులు
అధికారులు ఏమంటున్నారంటే..!
స్థానిక సంస్థల ఎన్నికల వేళ జిల్లాలో కొత్త పింఛన్ల అంశానికి రాజకీయ రంగు పులుముకుంది. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల మంజూరులో జాప్యం జరగడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఎన్నికలపై ప్రకటనతో.. చంద్రబాబు సర్కార్ కొత్త పింఛన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఇన్నాళ్లూ పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరిగినవారికి ఇప్పుడు దరఖాస్తుల స్వీకరణతో ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకునే చంద్రబాబు పాలి‘ట్రిక్స్’గా పొలిటికల్ సర్కిల్స్ నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.
సాక్షి, విజయవాడ: స్థానిక సంస్థల ఎన్నికల వేళ జనాన్ని మరోసారి బురిడీ కొట్టించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఒక్క పింఛన్ కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. కనీసం దరఖాస్తు చేసుకోవడానికి ఆన్‌లైన్ పోర్టల్ కూడా పని చేయకుండా పాలకులు చేశారంటే ఓట్లేసి గెలిపించిన ప్రజలపై చంద్రబాబు నిబద్ధతకు నిదర్శనమే ఈ రెండున్నరేళ్ల పాలన. ఎన్నికల సమయంలో మాత్రమే సంక్షేమాన్ని స్మరించి.. పథకాలను ఎరగా వేయడానికి చంద్రబాబు హామీలు గుప్పిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలుపు కోసం అలవిగాని హామీలను ప్రజలకు ఇచ్చి నమ్మించారు. అధికారం చేపట్టాక అమరావతి తప్ప మరేదీ తమకు అక్కర్లేదు అన్నట్లూ ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
పింఛన్ కోసం ..
పింఛన్ ఇప్పించడంటూ రెండున్నరేళ్లుగా కనిపించిన ప్రతి అధికారిని, కూటమి నేతలను పలువురు వృద్ధులు, వితంతు మహిళలు, దివ్యాంగులు విన్నవించుకున్నారు. సచివాలయాల చుట్టూ, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికలు రావడంతో నాటి ఎన్నికల హామీ సీఎం చంద్ర బాబునాయుడుకు ఇప్పుడు గుర్తు వచ్చినట్లుంది. రెండున్నరేళ్లుగా ప్రజలకు ఏమీ చేయలేదు గనుక తమకు ఓట్లేసే పరిస్థితి లేదని ఆయనకు తెలుసు. ఓటమి భయంతోనే ఇప్పుడు హడావుడిగా పింఛన్లు ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. దీనికితోడు ప్రభుత్వం ఏర్పడగానే సదరం ధ్రువీకరణ పత్రాల వెరిఫికేషన్ పేరిట ఉమ్మడి కృష్ణా జిల్లాలో వందలాదిమంది అర్హులైన దివ్యాంగుల పింఛన్ల తొలగించిన విషయం విదితమే. వారు సైతం పింఛన్ పునద్ధరణ కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగు తున్నారు.
మిగతా పథకాల సంగతి ఏమిటి ?
రెండున్నరేళ్లుగా ఏమీ చేయని తాము ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ప్రజలు నిలదీసే సూచనలు కనిపిస్తున్నాయని, తాము సమాధానం చెప్పలేమని.. ఓటు అడిగే సాహసం చేయలేమని కూటమి నేతల్లో అంతర్మథనం మొదలైంది. తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేవని చంద్రబాబుకు సీన్ అర్థమై.. అక్టోబర్ నుంచి పింఛన్లు ఇవ్వడానికి సిద్ధం అంటూ ప్రకటించారు. ప్రజలు మాత్రం ఎన్నికలు వస్తే గానీ తాము గుర్తుకు రామా అని ప్రశ్నిస్తున్నారు. వీటికితోడు ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పింఛన్ హామీలు ఎందుకు అమలు చేయలేదంటే ఏమి సమాధానం చెప్పాలని కంగారు పడుతున్నారని ‘తమ్ముళ్ల’ నుంచే వినిపిస్తోంది. అన్నదాతలకు బీమా పథకం వర్తింపజేయకపోవడం, ఉమ్మడి కృష్ణా జిల్లా రైతులు అధికమంది వరిసాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈసారి పంటసాగుకు నీళ్లివ్వకపోవడంతో అన్నదాతలు ఆగ్రహంతో రగలిపోతున్నారు.
గత వైఎస్సార్ సీపీ హయాంలో సచివాలయాల ద్వారా పార్టీలకు అతీతంగా.. ఎప్పటికప్పుడు అర్హతే ప్రామాణికంగా సంక్షేమ ఫలాలు, పింఛన్లు అందించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ ఫలాలు చేరవేశారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా 2019–24 మధ్య ఉమ్మడి కృష్ణా జిల్లాకు 1,77,529 ఇళ్లు మంజూరు చేశారు. అందులో ఎన్టీఆర్ జిల్లాకు 83,273, కృష్ణా జిల్లాకు 94,256 ఇళ్లు పేదలకు కేటాయించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సంక్షేమ ఫలాలు మరుగున పడిపోయాయి. ఎన్నికల సమయంలో ఇళ్లు లేని వారికి పట్టణాల్లో 2 సెంట్లు, పంచాయతీల్లో 3 సెంట్ల చొప్పున ఇస్తామని చెప్పి రెండున్నరేళ్లు అయింది. ఇంతవరకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. కనీసం సెంటు భూమి సేకరించలేదు. ఇదే ఇప్పుడు కూటమి నేతలకు శరాఘాతంగా మారనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల వేళ హడావుడిగా పింఛన్లు ఇస్తామంటూ చంద్రబాబు డ్రామాకు తెరలేపారు.
గత రెండున్నరేళ్ల కాలంలో పింఛన్ల దరఖాస్తులు ఎన్ని వచ్చాయని డీఆర్‌డీఏ జిలా స్థాయి అధికారులను ‘సాక్షి’ ఆరా తీసింది. గత రెండున్నరేళ్లుగా ఆన్‌లైన్ పోర్టల్ ఆగిపోయిందని, పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు తీసుకుని అక్‌నాలెడ్జ్‌మెంట్ ఇచ్చి పంపామన్నారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయో లెక్కచెప్పలేమన్నారు. పింఛన్ల కోసం పెద్ద ఎత్తున అర్జీలు వస్తున్న మాట వాస్తవమేనని చెప్పారు.


