తెలుగు నేర్చుకుంటున్న శ్రీలంక తెలుగు ప్రజలు | - | Sakshi
Sakshi News home page

తెలుగు నేర్చుకుంటున్న శ్రీలంక తెలుగు ప్రజలు

Aug 28 2026 4:27 AM | Updated on Aug 28 2026 4:27 AM

అవనిగడ్డ: శ్రీలంకలోని కొలంబోలో ఉన్న అల్‌ సిలోన్‌ తెలుగు కాంగ్రెస్‌ సభ్యులకు తెలుగు రాయడం, చదవడం నేర్పే కార్యక్రమం ప్రారంభమైంది. దీని ద్వారా కొలంబోలోని దాదాపు ఆరు లక్షల మంది తెలుగు ప్రజలకు మాతృభాష నేర్చుకునే అవకాశం కలిగింది. శ్రీలంక తెలుగు కాంగ్రెస్‌ ఆహ్వానం మేరకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ ఈ ఏడాది జూలై నెలలో శ్రీలంకలో పర్యటించారు. తెలుగు రాయడం, చదవడం నేర్పండి అంటూ శ్రీలంక తెలుగు ప్రజలు ఆయన ముందు వ్యక్తం చేసిన ఆకాంక్ష మేరకు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్‌ చొరవ చూపారు. హైదరాబాద్‌ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి వెలుదండ నిత్యానందరావు, రిజిస్ట్రార్‌ కోట్ల హనుమంతరావు సహకారంతో, శ్రీలంక బుద్ధ శాసన, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి హినీదుమ సునీల్‌ సెల్వీ ప్రోత్సాహంతో బుధవారం శ్రీలంకలో శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. శ్రీలంకలోని తెలుగు ప్రజలకు ఇద్దరు తెలుగు టీచర్లను నియమించి శిక్షణ ఇస్తున్నారు.

కిడ్నీ వ్యాధితో మరొకరి మృతి

ఎ.కొండూరు: కిడ్నీ వ్యాధి మరో ప్రాణాన్ని బలి గొంది. ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం మత్రియ తండా పంచాయతీ పరిధిలోని చైతన్య నగర్‌కు చెందిన బాణావతు హనుమ (60) కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బుధవారం అర్ధరాత్రి స్వగృహంలో మృతి చెందారు. తొమ్మిదేళ్లుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయనకు కుటుంబ సభ్యులు డయాలసిస్‌ చికిత్స అందిస్తున్నారు. వ్యవసాయ కూలీగా ఉపాధి పనులు చేసుకుంటూ జీవనం సాగించే హనుమకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కిడ్నీ వ్యాధి చికిత్స కోసం ఇప్పటి వరకు రూ. 8 లక్షల వరకు ఖర్చు చేసినా ఫలితం లేదని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇంటి పెద్దను కోల్పోవడంతో కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలాఉండగా కిడ్నీ వ్యాధితో మండలంలో తరచూ ఎవరో ఒకరు మృతి చెందుతున్నారు. హనుమ మృతిపై కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరరావు, సీపీఎం మండల కార్యదర్శి పానెం ఆనందరావు స్పందించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. కిడ్నీ వ్యాధి తీవ్రత దృష్ట్యా మండలంలో కృష్ణా జలాలను ప్రతి గ్రామానికి సక్రమంగా సరఫరా చేయాలని కోరారు.

భూ యజమానుల హక్కుల కల్పనకు చర్యలు

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): గతంలో పట్టాలు పొంది భూమిపై పూర్తి స్థాయిలో చట్టబద్ధమైన హక్కులు పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న భూ యజమానుల హక్కుల కల్పనకు సమగ్ర చర్యలు చేపట్టాలని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో గతంలో ఎన్టీఆర్‌ పట్టాలు పొందినా పూర్తి స్థాయిలో చట్టబద్ధమైన హక్కులు లేని వారు సుమారు 20 వేల మంది ఉన్నట్లు తెలిపారు. అటువంటి వారికి హక్కులు కల్పించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు ముందుగా క్షేత్రస్థాయిలో భూములను సర్వే చేయాలని ఆదేశించారు. పాత పట్టాలో పేర్కొన్న భూమి, ప్రస్తుతం భౌతికంగా ఉన్న భూమి వివరాలను పరిశీలించి, విస్తీర్ణం, సరిహద్దులు, సర్వే నంబర్‌ తదితర అంశాలను నిర్ధారించాలన్నారు. అవసరమైన చోట భూమి సరిహద్దులను గుర్తించి, భౌతిక పరిస్థితులను రికార్డుల్లోని వివరాలతో సరిపోల్చాలని ఆదేశించారు. రికార్డుల్లో ఏవైనా వ్యత్యాసాలు ఉంటే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. సర్వే, రికార్డుల పరిశీలన అనంతరం అర్హత కలిగిన భూ యజమానుల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. కాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ, ఆర్డీఓలు వెన్నెల శ్రీను, జి. అనిల్‌ కుమార్‌, తహసీల్దార్లు, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement