గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో ప్రతి దశలోనూ నాణ్యతకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని భారత ఎన్నికల సంఘం సీనియర్ డెప్యూటీ ఎలక్షన్ కమిషనర్ డాక్టర్ పవన్‌కుమార్‌శర్మ అన్నారు. లోపాలకు తావులేకుండా దోషరహితమైన ఓటర్ల జాబితాను రూపొందించడానికి సమష్టి కృషి అవసరమన్నారు. గురువారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ ఏవీఎస్ రెడ్డి హాల్‌లో రాష్ట్రంలో సర్ పురోగతిపై సమీక్ష, పరస్పర చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఏపీ సీఈవో వివేక్ యాదవ్, అదనపు సీఈవో ఎస్.ఢిల్లీరావుతో పాటు ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల జిల్లాల కలెక్టర్లు వర్చువల్‌గా పాల్గొన్నారు. ప్రస్తుతం నోటీసుల జారీ, విచారణ, క్లెయిమ్‌లు, ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో పురోగతిని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 43,71,397 నోటీసుల పంపిణీ కాగా 16,23,774 నోటీసులపై క్షేత్రస్థాయిలో విచారణ పూర్తయిందన్నారు. ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, బీఎల్వోలు, బీఎల్‌ఏలు, రాజకీయ పార్టీల మధ్య సమన్వయం, సహకారం అవసరమన్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం వంటి వివిధ కారణాలతో విచారణకు హాజరుకాలేని పక్షంలో ఈఆర్‌వో, ఏఈఆర్‌వో – బీఎల్‌వోను సమన్వయం చేసుకుంటూ ఇంటి సందర్శన, వివిధ మార్గాల ద్వారా ఓటర్లకు సహాయ సహకారాలు అందించాలన్నారు. నోటీసులపై విచారణ అనంతరం క్వాసీ జ్యుడీషియల్ అధికారి అయిన ఏఈఆర్‌వోలు సమస్యను అర్థం చేసుకొని న్యాయమైన తుది నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఫారం–6, 7, 8 తదితరాల స్వీకరణ, పరిష్కారం తదితర అంశాలనూ డాక్టర్ పవన్ కుమార్ శర్మ పరిశీలించారు. కలెక్టర్ లక్ష్మీశ, ఈఆర్వోలు పాల్గొన్నారు.


