స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌ సవరించాలి | - | Sakshi
Sakshi News home page

స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌ సవరించాలి

Aug 28 2026 4:27 AM | Updated on Aug 28 2026 4:27 AM

ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ఇన్‌–సర్వీస్‌ ఉపాధ్యాయుల సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్‌ టెట్‌ నోటిఫికేషన్‌ను వెంటనే సవరించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఆ సంఘ జిల్లా అధ్యక్షుడు వేముల భిక్షమయ్య ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఎన్నోసంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో సేవలందిస్తూ, అర్హత కలిగిన ఇన్‌–సర్వీస్‌ ఉపాధ్యాయులపై సాధారణ టెట్‌ నిబంధనలను యథాతథంగా వర్తింపజేయడం అన్యాయమన్నారు. స్పెషల్‌ టెట్‌ను ఆన్‌లైన్‌కు బదులుగా ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని, ఉత్తీర్ణత మార్కులను డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల తరహాలో 40 శాతానికి పరిమితం చేయాలని కోరారు. బోధన సబ్జెక్టు వరకే టెట్‌ పరీక్ష సిలబస్‌ను పరిమితం చేయాలని గతంలో పలుమార్లు ప్రభుత్వాన్ని కోరిందన్నారు. తాజా నోటిఫికేషన్‌లో ఈ అంశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందన్నారు. పక్కనున్న తమిళనాడు కూడా ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ మినహాయించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. ఇన్‌–సర్వీస్‌ ఉపాధ్యాయులపై అదనపు పరీక్ష భారం మోపకుండా, వారి సుదీర్ఘ సేవా అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని స్పెషల్‌ టెట్‌ నిబంధనలను పునః పరిశీలించాలన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఇన్‌ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌ పరీక్ష ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని డీఆర్వోకు సమర్పించారు. కార్యక్రమంలో సంఘ ప్రధాన కార్యదర్శి జి.అనుగ్రహ ప్రసాద్‌, రాష్ట్ర కౌన్సిలర్లు కొడాలి కిషోర్‌, ఎస్‌.మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement