ఉయ్యూరు టు కంకిపాడు కంకిపాడులో పదుల సంఖ్యలో కేసుల నమోదు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఆందోళనలో స్థానిక ప్రజానీకం కొత్త కేసుల్లేవంటూ మొన్ననే కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రకటన
మెరుగైన వైద్యం అందిస్తున్నాం..
కంకిపాడు: అతిసార వ్యాప్తి రూటు మార్చింది. నిన్న మొన్నటి వరకు ఉయ్యూరును వదలని డయేరియా కేసులు ఇప్పుడు పొరుగూళ్లుకు వ్యాపిస్తున్నాయి. కృష్ణాజిల్లా కంకిపాడులో డయేరియా కలకలం రేపుతోంది. వాంతులు, విరేచనాల లక్షణాలతో ప్రజలు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే బుధ, గురువారాల్లో 16 మంది రోగులు వాంతులు, విరేచనాలతో చేరారు. ప్రైవేటు ఆసుపత్రులు, ఆర్‌ఎంపీల వద్ద లెక్కకు మించి డయేరియా బాధితులు వైద్య సేవలు పొందినట్లు సమాచారం. డయేరియా విజృంభణకు తాగునీటి కలుషితమే ప్రధాన కారణం అయ్యి ఉంటుందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఉయ్యూరులో అతిసార అదుపులోకి వచ్చిందని, కొత్త కేసుల్లేవని జిల్లా కలెక్టర్ ప్రకటించిన మర్నాడే ఈ పరిణామం చోటు చేసుకోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
గ్రామం అంతటా డయేరియా కేసులు..
కంకిపాడు పట్టణం అంతటా డయేరియా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లోనే పట్టణంలోని చెరువు కట్ట, విజయలక్ష్మీ థియేటరు సెంటరు, రెల్లికాలనీ, వడ్రుపేట, లాకురోడ్డు ప్రాంతాల నుంచి రోగులు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందారు. రోగులకు ఆసుపత్రి వైద్య సిబ్బంది అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నారు. బాధితులు కుదుటపడగానే ఇళ్లకు పంపుతున్నారు. గురువారం పట్టణంలోని పలు ప్రాంతాలకు చెందిన ఆరుగురు వైద్య సేవలు పొందుతున్నారు. ఇది కేవలం సామాజిక ఆరోగ్య కేంద్రంలో పరిస్థితి. అయితే ప్రైవేటు ఆసుపత్రులు, ఆర్‌ఎంపీల వద్ద అధిక సంఖ్యలో ప్రజలు వాంతులు, విరేచనాలు లక్షణాలతో వైద్యం పొందినట్లు సమాచారం. పట్టణంలో సుమారుగా 100 మంది వరకూ డయేరియా బాధితులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
కలుషిత తాగునీరే కారణమా?
తాగునీటి కలుషితం వల్లే ప్రజలకు వాంతులు, విరేచనాలు వ్యాపించాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాగునీటి పైపులైన్లు పూర్తిగా మురుగు కాలువల వెంబడి ఉండటంతో పైపులైన్లు ద్వారా మురుగునీరు ప్రవేశించటంతో ప్రజల ఆరోగ్య పరిస్థితి ప్రమాదంలో పడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రోగులకు వైద్యసేవలు అందించిన వైద్యులు సైతం తాగునీరు ప్రధానంగా అయి ఉంటుందని, ఆహార కలుషితం కూడా కారణం అయ్యి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కేసులు నమోదవ్వటం వెనుక తాగునీరే కారణం అయి ఉంటుందని చెప్తున్నారు. పది రోజులు క్రితం కంకిపాడు పట్టణంలోని ట్యాంకును శుభ్రం చేసి క్లోరినేషన్ చేశారు. అయితే స్కవర్ వాల్స్ ద్వారా నీటిని విడిచిపెట్టకుండా నేరుగా ప్రజలకు తాగునీటిని సరఫరా చేయటంతో పది రోజులు క్రితమే ప్రజలు వాంతులు, విరేచనాలతో వైద్య సహాయం తీసుకున్నట్లు వైద్య ఆరోగ్య సిబ్బంది గుర్తించినట్లు సమాచారం.
పలు గ్రామాల్లోనూ బాధితులు..
కంకిపాడు పట్టణంతో పాటుగా మండలంలోని పలు గ్రామాల్లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ప్రొద్దుటూరు, పునాదిపాడు, గొల్లగూడెం, కోలవెన్ను గ్రామాల నుంచి డయేరియా బాధితులు వైద్యం కోసం కంకిపాడు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం పొందారు. ప్రొద్దుటూరుకు చెందిన జాన్ అనే వృద్ధుడు డయేరియా ప్రభావంతో తీవ్ర అనారోగ్యానికి గురవ్వటంతో 108 అంబులెన్సులో బుధవారం రాత్రి విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.
మంచాన పడ్డ రెల్లి కాలనీ..
పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో ఒకటైన రెల్లికాలనీ మంచాన పడింది. పట్టణంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించే కార్మికులు, సాధారణ ప్రజలు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఇక్కడ పది రోజులు క్రితమే వాంతులు, విరేచనాల బారిన పడి స్థానికులు ఆసుపత్రుల్లో వైద్యం పొందారు. అంతే కాకుండా తీవ్ర జ్వర లక్షణాలతో ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికీ పలువురు పారిశుద్ధ్య కార్మికులు పని చేసే ఓపిక లేక సెలవుపై ఉన్నారంటే సమస్య తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
వాంతులు, విరేచనాలతో వస్తున్న బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. మందులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకూ రోగులను ఎవరినీ వైద్యం చేయకుండా పంపలేదు. సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. పరిస్థితి అదుపులోనే ఉంది.
– డాక్టర్ రెహమాన్, కంకిపాడు సీహెచ్‌సీ


