76 ఏళ్ల వయసులోనూ అద్భుత ప్రదర్శనలు యువ మహిళా కళాకారిణులకు స్ఫూర్తి సంగీతయానంలో పద్మశ్రీ పురస్కారం ఓ కలికితురాయి
గురు సంప్రదాయాన్ని కాపాడుకోవాలి
మృదంగ విద్వాంసురాలు సుమతీ రామ్మోహనరావు(ఫైల్)
విజయవాడ కల్చరల్: ఆడపిల్లలు గడపదాటకూడదన్న ఆ కాలంలోనే మృదంగంపై అంతులేని ప్రేమతో విద్య నేర్చుకున్నారు విజయవాడకు చెందిన దండమూడి సుమతీ రామ్మోహనరావు. పురుషాధిక్య వాద్య ప్రపంచంలో తన అద్భుత ప్రతిభతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. ఆనాటి నుంచి నేటి వరకూ మృదంగంపై ఆమె చేతి వేళ్లు నాట్యమాడుతూనే ఉన్నాయి. అనేకమంది యువ మృదంగ కళాకారిణులకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నాయి.
బాల్యంలోనే లయతో అనుబంధం..
1950 అక్టోబర్ 16న జన్మించారు. ఆమెకు తొలిగురువు తండ్రి నిడుమోలు రాఘవయ్య. అనంతరం ఆమె మృదంగ విద్వాంసుడు దండమూడి రామ్మోహనరావు వద్ద మృదంగ విద్యలో ఆయన వద్ద నుంచి పుదుక్కోటై సంప్రదాయంలో మెళకువలు నేర్చుకున్నారు. ఆయననే వివాహం చేసుకున్నారు. భరతనాట్యంలోనూ గౌరవ విభాగంలో డిప్లొమా పూర్తి చేశారు. దేశంలోనే అరుదైన ఏ టాప్ గ్రేడ్ దంపతులుగా ఖ్యాతిని పొందారు. రామ్మోహనరావుతో కలసి దేశ విదేశాలలో అనేక ప్రదర్శనలు ఇచ్చారు.
సోలో ప్రదర్శనలో ప్రత్యేక గుర్తింపు..
సుమతి కేవలం కచేరీల్లో వాద్య సహాయకురాలిగానే నిలిచిపోలేదు. సోలో ప్రదర్శనలు ఇస్తూనే.. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగీత విద్వాంసులకు వాద్య సహకారం అందించారు.
గురువుగా మరో సంచలనం..
కళాకారిణిగా సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా అనేకమంది మృదంగంలో శిక్షణ నిచ్చారు. దండమూడి రామ్మోహనరావు లయ వేదికను స్థాపించి రామ్మోహనరావును స్మరించుకుంటూ శత మృదంగ నివాళి కార్యక్రమం నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రామ్మోహనరావు విగ్రహం ఏర్పాటు చేశారు.
పురస్కారాలకే వన్నె తెచ్చిన సుమతి..
మద్రాస్ మ్యూజిక్ అకాడమీ నుంచి 1974, 1976 సంవత్సరాలలో బెస్ట్ మృదంగిస్ట్ పురస్కారం లభించింది. 2008లో న్యూ ఢిల్లీకి చెందిన ఇంటర్ నేషనల్ పబ్లిషింగ్ హౌస్ నుంచి బెస్ట్ సిటిజన్, 2009లో కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్న తొలి మృదంగ కళాకారిణి కావడం విశేషం. వివిధ సాంస్కృతిక సంస్థలు మృదంగ శిరోమణి, మృదంగ లయ విద్యాసాగర, నాద భగీరథ, సునాద సుధానిధి, నాద మృదంగ విద్వన్‌మణి తదితర బిరుదులతో సత్కరించాయి.
సుమతీ రామ్మోహనరావు సంగీత సేవలను గుర్తించి 2021లో పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. 2022లో లోక్ సభలో పద్మశ్రీ గ్రహీతల ముఖాముఖీలో పాల్గొని అప్పటి స్పీకర్ అభినందించడం మరచిపోలేని అనుభూతి అని ఆమె వినయంగా చెప్పుకుంటారు.
ఏడేళ్ల వయస్సులో సంగీత యాత్ర ప్రారంభించా. మృదంగ విద్వాంసుడు రామ్మోహనరావు ఆశీర్వాదంతో సంగీతంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నా. మా కుటుంబంలో సంగీతం వారసత్వంగా వస్తోంది. మృదంగం మీద అభిమానంతో నాదంపై పట్టు సాధించా. మహిళలు అన్ని రంగాలలోనూ రాణించగలరు. కృషి చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు.
– సుమతీ రామ్మోహనరావు, మృదంగ విద్వాంసురాలు


