పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌లో 94 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌లో 94 ఫిర్యాదులు

Aug 25 2026 1:51 AM | Updated on Aug 25 2026 1:51 AM

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌లో 94 ఫిర్యాదులు నూర్‌బాషాలను విస్మరిస్తున్న కూటమి ప్రభుత్వం రేపు బందరులో పవిత్ర ఊరేగింపు ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ప్రజల నుంచి 94 ఫిర్యాదులు అందాయి. పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు డీసీపీ ఏబీటీఎస్‌ ఉదయరాణి ప్రజల నుంచి ఫిర్యాదులు అందుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్య తెలుసుకుని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలతో మాట్లాడి సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా వచ్చిన ఫిర్యాదుల్లో ఆస్తి, భూ వివాదాలకు సంబంధించి 36, భార్యాభర్తలు, కుటుంబ కలహాలపై 4, వివిధ మోసాలపై 10, మహిళా సంబంధిత నేరాలపై 9, కొట్లాటలపై 5, దొంగతనాలపై 5, వివిధ ఇతర సమస్యలపై 25 ఫిర్యాదులు వచ్చారు. పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నూర్‌బాషా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓ రసూల్‌ సాహెబ్‌

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): కూటమి ప్రభుత్వం నూర్‌బాషా ముస్లింలను విస్మరిస్తోందని నూర్‌బాషా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఓ రసూల్‌ సాహెబ్‌ ఆరోపించారు. సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూర్‌బాషా సంక్షేమానికి ఏటా రూ.100కోట్లు కేటాయిస్తామని కూటమి హామీ ఇచ్చిందన్నారు. మేనిఫెస్టోలోనూ చేర్చారన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా నూర్‌బాషాలకు ఒక్క రూపాయి కూడా విదల్చలేదన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మైనార్టీ మంత్రి, సంబంధిత శాఖల అధికారుల చుట్టూ తిరిగి వినతి పత్రాలు సమర్పిస్తున్నా పట్టించుకున్న నాథుడు లేడన్నారు. సెప్టెంబర్‌ 27లోగా నూర్‌బాషాలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రెండేళ్లకు కలిపి రూ.200కోట్లు కేటాయించాలన్నారు. లేని పక్షంలో విజయవాడ నగరంలోని మహానేత వైఎస్సార్‌ విగ్రహం వద్ద నిరాహార దీక్ష చేపడతానన్నారు. నూర్‌బాషా సంఘం నేతలు షేక్‌సైదు బాజీ, డీఎం సుభాని, షేక్‌ హసన్‌ వలి పాల్గొన్నారు.

మచిలీపట్నంటౌన్‌: మిలాద్‌ ఉన్‌ నబి పర్వదినాన్ని ఈనెల 26వ తేదీ బుధవారం ఘనంగా నిర్వహించేందుకు నగరంలోని ముస్లింలు సన్నద్ధమయ్యారు. ఈ సందర్భంగా నగరంలోని నాగ పోతరావు సెంటర్‌ నుంచి చింత చెట్టు సెంటర్‌ వరకు ఉన్న ప్రధాన రహదారిలో విద్యుత్‌ దీపాలతో భారీ పందిరిని ఏర్పాటు చేశారు. అలాగే నగరంలోని సెంటర్‌ రివైడర్లలో ఉన్న స్తంభాలకు, కోనేరు సెంటర్‌ సర్కిల్‌ చుట్టూ జెండాలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. ఆరోజు జగత్‌ ప్రవక్త హజ్రత్‌ మహమ్మద్‌ ముస్తఫా జన్మదినం సందర్భంగా సాయంత్రం 4.30 గంటలకు నగరంలోని జామియా మసీదు నుంచి పవిత్ర ఊరేగింపు జరుగుతుందని స్థానిక ముస్లిం పెద్దలు సోమవారం ప్రకటించారు. ఈ ఊరేగింపు కొత్త మసీదు మీదుగా మంజుమన్‌, జవ్వారుపేట, హస్మీరజా మసీద్‌, ఎస్పీ బంగ్లా, టాక్సీ స్టాండు మీదుగా కోనేరు సెంటర్‌ కు చేరుతుందన్నారు. అనంతరం పలు రాష్ట్రాల నుంచి విచ్చేసిన మత గురువుల ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుందన్నారు.

నున్న(విజయవాడరూరల్‌): నున్న గ్రామంలో నివాసం ఉంటున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ భార్య దీపాలి గోపాల్‌ పరదేశి(39)ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వీఆర్‌ఏ పల్నాటి నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నున్న పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు, నున్న ఏఎస్‌ఎం కాలేజి రోడ్డులో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ గోపాల్‌ పరదేశి(మహారాష్ట్ర) కుటుంబం కేడీఎస్‌ ప్రసాద్‌ ఇంట్లో అద్దెకు ఉంటోంది. గోపాల్‌ భార్య దీపాలి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం దీపాలి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకొంది. భర్త, ఇద్దరు పిల్లలు(పాప, బాబు) డీమార్ట్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన సందర్భంలో తలుపులు వేసి ఉండటాన్ని గమనించి హెడ్‌కానిస్టేబుల్‌, స్థానికుల సహాయంతో తలుపులను పగులగొట్టి చూడగా దీపాలి ఉరి వేసుకొని ఉంది. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయింది. వీఆర్‌ఏ నాగరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement