ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
హనుమాన్‌జంక్షన్‌రూరల్: బాపులపాడు మండలం మల్లవల్లిలో బీసీ సామాజికవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త బొల్లిగర్ల కోటేశ్వరరావుపై అదే పార్టీకి చెందిన నాయకుడు, తన అనుచరులతో అర్ధరాత్రి సమయంలో దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో ఓ పోలీస్ కేసులో చిక్కుకోవటంతో దాన్ని సెటిల్‌మెంట్ చేసేందుకు గ్రామానికి చెందిన టీడీపీ నేత అక్కినేని పరమేశ్వరరావు రూ.60వేలు ముడుపులు చెల్లించాలని తనను డిమాండ్ చేశారని బొల్లిగర్ల కోటేశ్వరరావు ఆరోపించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో జరిగిన పంచాయతీలో రూ.35వేలు లంచం ఇచ్చానని, కానీ తనపై పగతో అప్పటి నుంచి పరమేశ్వరరావు కాలు దువ్వుతున్నారని కోటేశ్వరరావు వాపోయాడు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం కూడా రేమల్లే సమీపంలో బైక్‌పై వెళ్తుండగా నలుగురు యువకులు ఆపి తనపై దాడి చేశారని, దీంతో భయపడి అప్పటి నుంచి గ్రామం విడిచి నున్నలో తలదాచుకుంటున్నానని చెప్పాడు.
అర్ధరాత్రి బీరు బాటిళ్లతో దాడి..
ఈ నెల 22వ తేదీన మల్లవల్లి రావటంతో సమాచారం అందుకున్న అక్కినేని పరమేశ్వరరావు, ఆయన అనుచరులతో మధ్యాహ్నం సమయంలో తన ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని బాధితుడు ఆరోపించారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో తమ ఇంటిపై మద్యం తాగిన ఆ యువకులు దాడి చేసి, బీరు బాటిళ్లతో తలపై బలంగా కొట్టారని కోటేశ్వరరావు చెప్పారు. తీవ్రంగా గాయపడటంతో వీరవల్లి పోలీసులకు సమాచారం అందించానని, వెంటనే చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో గన్నవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారని తెలిపారు. ఈ దాడి ఘటనపై వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. తనకు మల్లవల్లికి చెందిన టీడీపీ నాయకుడు అక్కినేని పరమేశ్వరరావు నుంచి ప్రాణహాని ఉందని, మళ్లీ స్వగ్రామం వెళ్లాలంటే భయంగా ఉందని బొల్లిగర్ల కోటేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశాడు. కాగా ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి కోటేశ్వరరావుపై జరిగిన దాడి ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వీరవల్లి ఎస్‌ఐ సత్యం సురేష్ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): కూటమి ప్రభుత్వ పాలనలో సామాన్యుడు బతికే పరిస్థితి పూర్తిగా కరువైందని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నా కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని మండిపడ్డారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయంటూ నానా యాగీ చేసిన కూటమి నాయకులు, నేడు మార్కెట్‌లో ధరలు ఇంత దారుణంగా పెరుగుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు పూట గడవక తీవ్ర అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు బజార్లలో అధికారుల పర్యవేక్షణ పూర్తిగా కరువవడంతో దళారులు వ్యవస్థను తమ గుప్పెట్లోకి తీసుకుని, కూరగాయల ధరలను విపరీతంగా పెంచేస్తూ వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.
దానిపై వెళ్తున్న భార్య దుర్మరణం.. భర్తకు తీవ్రగాయాలు
గుంటుపల్లి(ఇబ్రహీంపట్నం): స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను లారీ ఢీకొట్టిన ఘటనలో భార్య మృతి చెందగా.. భర్త తీవ్రంగా గాయపడ్డాడు. మండలంలోని గుంటుపల్లి సెంటర్‌లో 65వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నంకు చెందిన నందం బాలగంగాధరరావు, ఆయన సతీమణి నిర్మల జ్యోతి(56) స్థానిక ఖాజీపేటలోని అంజనీ గ్రీన్‌పార్క్ అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్నారు. వారి అబ్బాయి, అమ్మాయి ఇతర రాష్ట్రాల్లో సెటిలై ఉంటున్నారు.
వెనుక నుంచి ఢీకొట్టి..
భార్యాభర్తలు విజయవాడలో నిర్వహిస్తున్న బంగారం దుకాణానికి ప్రతిరోజు మాదిరిగా స్కూటీపై బయలుదేరారు. ఓ కిలోమీటర్ దూరం ప్రయాణించే సమయానికి గుంటుపల్లి సెంటర్‌లో వెనుకవైపు నుంచి వచ్చిన కంటైనర్ లారీ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై నుంచి కిందపడిన నిర్మల జ్యోతి తలమీదుగా లారీ చక్రాలు వెళ్లడంతో తల, ముఖం నుజ్జునుజ్జు అయ్యింది. లారీ టైర్లు దాటిన తర్వాత ఆమె పక్కనే పడిన భర్త బాలగంగాధరరావు తీవ్రమైన గాయాలతో ప్రాణాలు దక్కించుకున్నాడు. అపరస్మారక స్థితిలోకి వెళ్లిన భర్తను పోలీసులు గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ ఆగకుండా వెళ్లిపోవడంతో ఆ ప్రాంతంలో ఉన్న కొందరు యువకులు బైకులతో వెంబడించి గ్రామం చివరన ఉన్న సీఏ కన్వెన్షన్ వద్ద అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనతో భారీగా నిలిచిన వాహనాలను ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించారు. సెక్టార్ ఎస్‌ఐ సత్యవతి నిర్మల జ్యోతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


