మార్షల్‌ ఆర్ట్స్‌లో కొండపల్లి విద్యార్థికి గోల్డ్‌ | - | Sakshi
Sakshi News home page

మార్షల్‌ ఆర్ట్స్‌లో కొండపల్లి విద్యార్థికి గోల్డ్‌

Aug 25 2026 1:51 AM | Updated on Aug 25 2026 1:51 AM

మార్షల్‌ ఆర్ట్స్‌లో కొండపల్లి విద్యార్థికి గోల్డ్‌ చికిత్స పొందుతూ హోంగార్డు మృతి బందరు జీజీహెచ్‌లో కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన

కొండపల్లి(ఇబ్రహీంపట్నం): కొండపల్లి శాంతినగర్‌కు చెందిన ఎనిమిదేళ్ల విద్యార్థి కన్నమాల ఇవాన్‌ రాయేల్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో విశిష్ట ప్రతిభ చాటి అరుదైన గౌరవం పొందాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌ గచ్చిబౌలిలో జరిగిన విజన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ తరఫున కరాటే పోటీల్లో పాల్గొని తన విశిష్ట ప్రతిభ కనబరిచాడు. విద్యార్థి ప్రతిభను గుర్తించిన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌ సంస్థ ఈనెల 22న తెలంగాణ షీ పవర్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మెడల్‌ ప్రదానం చేసింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌, సినీ హీరో మహేష్‌ బాబు సతీవణి నమ్రత శిరోద్కర్‌, 9వ నిజాం రాజా వంశానికి చెందిన నవాబ్‌ రౌనక్‌ ఖాన్‌ లాంటి ప్రముఖులు ఇవాన్‌ను ఘనంగా సన్మానించి గోల్డ్‌ మెడల్‌, సర్టిఫికెట్‌ అందజేశారు. ఇవాన్‌ను పలువురు అభినందించారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): స్కూటీతో ఆవును ఢీ కొట్టడంతో తలకు గాయమై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హోం గార్డ్‌ మృతి చెందిన ఘటన భవానీపురం పోలీసు స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. భవానీపురం హెచ్‌బీ కాలనీ ఓల్డ్‌ ఎంఐజీకి చెందిన తంగెళ్లమూడి రాజశేఖర్‌(48) హోంగార్డుగా పనిచేస్తున్నాడు. ఈనెల 16వ తేదీ ఉదయం 7 గంటలకు ఇంటి నుంచి స్కూటీపై డ్యూటీకి బయలుదేరాడు. స్వాతి రోడ్డులో కేఎఫ్‌సీ వరకు వెళ్లే సరికే అకస్మాత్తుగా ఆవు రోడ్డుపైకి వచ్చింది. ఎదురుగా వస్తున్న ఆవును ఢీకొట్టడంతో కింద పడిపోయి తలకు బలమైన గాయమైంది. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో సిబ్బంది గొల్లపూడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం సూర్యారావుపేటలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. అతని భార్య శ్రీలక్ష్మీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆవును నిర్లక్ష్యంగా రోడ్డుపైకి వదిలిన యజమానిపై చర్యలు తీసుకోవాలని ఆమె తన ఫిర్యాదులో కోరారు.

మచిలీపట్నంఅర్బన్‌: కాంట్రాక్టు మెడికల్‌, పారా మెడికల్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి, న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఏపీ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా సోమవారం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా జేఏసీ నాయకులు, వైద్య సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆగస్టు 24 నుంచి 27వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలుపుతామన్నారు. ఆగస్టు 28, 29 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 1 వరకు ఆన్‌లైన్‌ విధుల బహిష్కరణ కార్యక్రమం, సెప్టెంబర్‌ 6న ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద, 7న కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం కూడా ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోతే సెప్టెంబర్‌ 8 నుంచి జేఏసీ నిర్ణయం మేరకు విధుల బహిష్కరణకు దిగుతామని హెచ్చరించారు. జిల్లా జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement