వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
కృష్ణలంక(విజయవాడతూర్పు): వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టు అక్రమమని, ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే జరిగిందని పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ మండిపడ్డారు. వైఎస్సార్ సీపీలో బీసీ సామాజిక వర్గాలకు చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో అవినాష్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ఉద్దేశంతో అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో బీసీలకు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం కల్పించి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు. బీసీ నాయకులను ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్ చేస్తూ వేధింపులకు పాల్పడటం దుర్మార్గమన్నారు. నాగేశ్వరరావుపై రాజకీయ కక్షతో వ్యవహరించడం మానుకోవాలని, ఆయన అరెస్టుకు దారితీసిన పరిస్థితులపై సమగ్రంగా విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకులపై వేధింపులు, అక్రమ కేసులు, అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అడ్డుకోలేరని, వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ప్రజల తరఫున నిరంతరం పోరాడుతారని స్పష్టం చేశారు. వెన్నుపోటు పార్టీ కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని హితవుపలికారు.
సిద్ధార్థ మెడికల్ కాలేజీ
అభివృద్ధే లక్ష్యం
కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా కాలేజీ ప్రిన్సిపాల్, పూర్వ విద్యార్థి డాక్టర్ ఎ.ఏడుకొండలరావు అమెరికాలో పర్యటిస్తున్నట్లు కాలేజీ కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐ వైద్యులు, కాలేజీ పూర్వ విద్యార్థులతో సమావేశమవుతూ కాలేజీ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చిస్తున్నారని తెలిపారు. అమెరికాలోని వివిధ మెడికల్ స్కూళ్లు, ఆసుపత్రులను సందర్శిస్తూ బోధనా సౌకర్యాల మెరుగుదల, వైద్య విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఆధునిక క్లినికల్ స్కిల్స్, రోగుల సంరక్షణ వంటి అంశాలపై వైద్య నిపుణులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అలబామా రాష్ట్రంలోని హంట్స్‌విల్ నగరాన్ని సందర్శించి అక్కడ నివసిస్తున్న సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు, ఎన్‌ఆర్‌ఐ వైద్యులను కలుసుకున్నారు. సీనియర్ న్యూరోఫిజీషియన్ డాక్టర్ ఆలపాటి ఆంజనేయులు, అనస్థీషియాలజిస్ట్, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థి డాక్టర్ మురళి, సీనియర్ పీడియాట్రీషియన్ డాక్టర్ తోటకూర నాగేంద్ర తదితరులతో సమావేశమై కాలేజీ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించి వారి సలహాలు, సూచనలు, సహకారాన్ని కోరారన్నారు. అట్లాంటాలో సెప్టెంబర్ 4, 5, 6 తేదీల్లో జరగనున్న గుంటూరు మెడికల్ కాలేజీ, రంగరాయ మెడికల్ కాలేజీ, కాకినాడ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల రీయూనియన్‌లో పాల్గొని కాలేజీ అభివృద్ధిపై చర్చిస్తారని చెప్పారు.
అదృశ్యమైన వృద్ధురాలి
మృతదేహం లభ్యం
కృష్ణలంక(విజయవాడతూర్పు): దుస్తులు ఉతకడానికి బందరు కాలువ ఒడ్డుకు వెళ్లి అదృశ్యమైన ఓ వృద్ధురాలు ఆదివారం శవమై కనిపించింది. వివరాల మేరకు బాడవపేట అంబేద్కర్ వీధిలో నివసిస్తున్న వెంగలదాసు దుర్గ (70) శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో దుస్తులు ఉతకడానికి బందరు కాలువ ఒడ్డుకు వెళ్లి కనిపించ కుండా పోయిన విషయం తెలిసిందే. సాయంత్రం 5.30 గంటలకు కూడా ఇంటికి రాకపోవడంతో మేనల్లుడు శిఖా నాగేంద్రబాబు.. ఆమె బట్టలు ఉతకడానికి వెళ్లిన బందరు కాలువ వద్దకు వెళ్లి చూడగా బట్టలు, చెప్పులు అక్కడే ఉన్నాయి. ఆమె మాత్రం కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెదికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీనిపై నాగేంద్రబాబు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏపీఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం, పోలీసులు ఆదివారం బందరు కాలువలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం 4.30 గంటలకు ఆమె మునిగిన చోటే శవమై కనిపించింది. దుస్తులు ఉతుకుతూ ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడి మునిగి మరణించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


