యువతను సాహిత్యం వైపు మళ్లించాలి | - | Sakshi
Sakshi News home page

యువతను సాహిత్యం వైపు మళ్లించాలి

Aug 24 2026 7:27 AM | Updated on Aug 24 2026 7:27 AM

విజయవాడ కల్చరల్‌: యువతను సాహిత్యం వైపు మళ్లించి, విలువలతో కూడిన జీవన విధానాన్ని అలవర్చేలా కృషి చేయాలని మానసిక వైద్యుడు డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి అన్నారు. మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో బందరు రోడ్డులోని ఠాగూర్‌ గ్రంథాలయంలో ఆదివారం ‘సృజనోత్సవం’ పేరుతో సాహిత్య, నృత్య సభ నిర్వహించారు. ముఖ్య అతిథి డాక్టర్‌ ఇండ్ల రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పలువురు యువత డ్రగ్స్‌ వంటి చెడు అలవాట్లకు బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులు యువతను సత్ప్రవర్తన, సత్‌ సాహిత్యం వైపు నడిపించేందుకు కృషి చేయాలని సూచించారు. మల్లెతీగ సాహిత్య వేదిక వ్యవస్థాపకుడు కలిమిశ్రీ మాట్లాడుతూ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్య పరిరక్షణకు సంస్థ కృషి చేస్తోందన్నారు. గిడుగు రామమూర్తి వారసుడు గిడుగు వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ వ్యవహారిక భాషా ఉద్యమానికి గిడుగు రామమూర్తి పంతులు ఆద్యుడని పేర్కొన్నారు. గిడుగు రామమూర్తి జయంతి సందర్భంగా వివిధ రంగాలకు చెందిన పైనేని తులసినాయుడు, షేక్‌ కరీముల్లా, డాక్టర్‌ తూములూరి రాజేంద్రప్రసాద్‌, విల్సన్‌రావు కొమ్మవరపు, రేపాక రఘునందన్‌, జ్యోతిమువ్వల, ఎంవీ కల్యాణి, డాక్టర్‌ వి.రఘుపతి, డాక్టర్‌ టి.పార్థసారథి, వసుధలకు గిడుగు–మల్లెతీగ సేవా పురస్కారాలు అందజేశారు. కవుల స్వీయ కవితాగానం, కళాక్షేత్ర డాన్స్‌ అకాడమీ విద్యార్థుల సంప్రదాయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డాక్టర్‌ ఎం. ప్రభాకర్‌, చిన్ని నారాయణ, సీనియర్‌ జర్నలిస్ట్‌ ఘంటా విజయకుమార్‌, ఠాగూర్‌ గ్రంథాలయ పాలకురాలు కె. రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement