అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహితంగా మార్చడానికి కృషి చేస్తున్నామని పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు అన్నారు. దేశంలో యువతను నాశనం చేసేందుకు పాకిస్థాన్ డ్రగ్స్ అనే పంజాను విసురుతోందని, ఈ కుట్రలను భగ్నం చేసేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని ఏపీ ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈగల్) చీఫ్, ఐజీపీ ఆకే రవికృష్ణ పేర్కొన్నారు. డ్రగ్స్, గంజాయిపై యుద్ధంలో భాగంగా అజిత్‌సింగ్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ స్కూల్ ఆవరణలో ‘ఈగల్ చాలెంజ్’ కార్యక్రమం ఆదివారం జరిగింది. రవికృష్ణ మాట్లాడుతూ.. దేశానికి యువతే బలమని.. ఆ బలాన్ని బలహీన పరిచేందుకు శత్రుదేశాలు డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలను ఎరగా వేస్తున్నాయని ఆరోపించారు. గంజాయి, డ్రగ్స్ మానేసిన 60 మంది యువకులకు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నూతన వస్త్రాలు అందజేశారు. నార్త్‌జోన్ ఏసీపీ సత్యానందం, సీఐలు చంద్రశేఖర్, ఎస్.వి.వి.ఎస్.లక్ష్మీనారాయణ, అహ్మద్ అలీ, పలువురు ఎస్‌ఐలు, న్యాయవాది బొండా సిద్ధార్థ తదితరులు పాల్గొన్నారు.


