కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే పథకం మిషన్ వాత్సల్య క్షేత్రస్థాయిలో దరఖాస్తులు ఇచ్చేందుకు ఆశగా ఎదురు చూస్తున్న అనాథలు మార్గదర్శకాలు వస్తేనే దరఖాస్తులు స్వీకరిస్తామంటున్న సీడీపీయూ, ఐసీడీఎస్ అధికారులు
సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం
ఎవరు అర్హులంటే..
సాక్షి, విజయవాడ: సమాజంలో వివిధ కారణాలతో అనాథలుగా మారుతున్న చిన్నారులు, దిక్కులేని అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రవేశపెట్టిన పథకం ‘మిషన్ వాత్సల్య’. ఈ పథకం లబ్ధి కోసం ఎన్టీఆర్ జిల్లాలో ఎంతో మంది అనాథలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో అమ లయ్యే ఈ పథకాన్ని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (డీసీపీయూ), ఐసీడీఎస్ శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తాయి. క్షేత్రస్థాయిలో పథకం గురించి ఐసీడీఎస్ సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడంతో ఈ పథకం కొందరికే అందుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అభాగ్యుల కోసమే పథకం
తల్లిదండ్రులను కోల్పోయిన 18 ఏళ్ల లోపు అనాథ పిల్లలకు మిషన్ వాత్సల్య పథకం వర్తిస్తుంది. 2022లో కేంద్ర ప్రభుత్వంలోని ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పాబ్) అనుమతుల మేరకు ఈ పథకాన్ని మూడేళ్ల పాటు పకడ్బందీగా అమలు చేశారు. ఈ పథకం అమలుకు సంబంధించి ఈ ఏడాది సరికొత్త మార్గదర్శకాలు ఇంకా రాలేదు. మరోవైపు మిషన్ వాత్సల్య పథకం ద్వారా ఏటా వందల సంఖ్యలో చిన్నారులు లబ్ధి పొందుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు లేని చిన్నారులు, పలు కారణాలతో కుటుంబానికి దూరమైన పిల్లలు చాలామంది ఉన్నప్పటికీ, వారికి ఈ పథకం గురించి తెలియక లబ్ధి కోల్పోతున్నారు.
వాటికే మొదటి ప్రాధాన్యత
మిషన్ వాత్సల్య పథకానికి ప్రాజెక్టు అప్రూవల్ బోర్డు (పాబ్)కు 450 మొదటి ప్రాధాన్యత దరఖాస్తులు సమర్పించారు. ఇప్పుడు వచ్చే గైడ్‌లైన్స్ ఆధారంగా వీటికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, తరువాత కొత్తవి స్వీకరిస్తామని ఆయా శాఖల సిబ్బంది చెబుతున్నారు. కొత్తగా తీసుకునే వాటిని రెండో ప్రాధాన్యత కింద స్వీకరి స్తారు. ఇందులో కేంద్రప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను కలిపి లబ్ధిదారుల ఖాతాల్లో నెలకు రూ.4 వేల చొప్పున జమ చేస్తారు. 2022లో ఉమ్మడి కృష్ణా జిల్లావ్యాప్తంగా 14 వేలకుపైగా దరఖాస్తులు రాగా, జిల్లాల పునర్విజన తరువాత ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి సుమారు ఏడు వేల మేర దరఖాస్తులు వచ్చాయి. వాటిని స్క్రూటినీ చేసి పక్కాగా అర్హత ఉన్న 551 మందికి మూడేళ్లపాటు లబ్ధి చేకూర్చారు. అయితే అంతకుముందు ఐసీపీఎస్ (ఇంటి గ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్) ద్వారా లబ్ధిదారుడికి కేవలం రూ.1500 మాత్రమే ఇచ్చేవారు. అయితే ఆ పథకాన్ని 2022లో నాటి కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వాలు ఐసీపీఎస్‌ను మిషన్ వాత్సల్యగా మార్చడంతో పాటు నగదు కూడా రూ.4 వేలకు పెంచి ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే మొత్తం ఇవ్వనున్నారు.
సోషల్ మీడియా ప్రచారం నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా మిషన్ వాత్సల్య పథకానికి దరఖాస్తులు ఇచ్చేందుకు పెద్దఎత్తున అర్హులు వేచి చూస్తున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు ఈ మిషన్ వాత్సల్య పథకానికి సిఫార్సులు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకానికి అర్హత ఉన్న వారిని ఎంపిక చేసేవారు. గతంలో ఉన్న గైడ్‌లైన్స్ ప్రకారం ఆర్ఫన్స్ (అనాథలు), సెమీ ఆర్ఫన్స్ (తల్లి లేదా తండ్రి మాత్రమే జీవించి ఉంటే), హెచ్‌ఐవీ బాధితుల పిల్లలు ఈ పథకానికి అర్హులు. ఇప్పుడు సోషల్ మీడియాలో పథకం గురించి విస్తృతంగా ప్రచారం అవుతోంది. అందులో విడాకులు తీసుకున్న జంటల పిల్లలు, యాసిడ్ బాధితులు, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారి పిల్లలకు కూడా మిషన్ వాత్సల్య పథకం వర్తిస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీంతో ఆయా వర్గాల నుంచి భారీగా దరఖాస్తులు ఇచ్చేందుకు వేచి ఉన్నారు.
2026 మార్చి 31 నాటికి 18 ఏళ్లలోపు ఉన్న ఆర్ఫన్ (అనాథ), సెమీ ఆర్ఫన్ (తల్లి లేక తండ్రిని కోల్పోయిన బిడ్డలు), హెచ్‌ఐవీ బాధిత పిల్లలు అర్హులు. కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే లబ్ధిదారుల ఖాతాల్లో ఒక ఏడాదికి సంబంధించి ఒకేసారి నగదు జమ అవుతుంది. ఎన్ని నెలలు సహాయం అందుతుందనేది కేంద్రం విడుదల చేసే నిబంధనలు, నిధులపై ఆధారపడి ఉంటుంది.


