మచిలీపట్నంటౌన్: నగరంలోని బచ్చుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణ మండపంలో గురు వారం జిల్లా దేవదాయ, ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా పాల్గొని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ, డీఆర్వో చంద్రశేఖరరావుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు మాట్లాడుతూ.. బందరు ఓడరేవు నిర్మాణ పను లను త్వరితగతిన పూర్తి చేసి వచ్చే ఉగాది నాటికి ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లా డుతూ.. ఉగాది పచ్చడిలో తీపి, చేదు కలయికలను సమానంగా అంగీకరించాలన్నారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెంది అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలన్నారు. తొలుత విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. ఈ సంవత్సరం నవగ్రహాలలో ఆరు గ్రహాలు శుభగ్రహాలుగా ఉన్నాయన్నారు. సకా లంలో వర్షాలు కురిసి, పంటలు బాగా పండి రైతులు ఆనందంగా ఉంటారన్నారు. దేవదాయ శాఖలో విశిష్టంగా సేవలు అందించిన పది మంది వేద పండితులు, అర్చక స్వాములను రూ.10,116 చొప్పున నగదు పురస్కారాలు, శాలువా, నూతన వస్త్రాలతో మంత్రి, కలెక్టర్ సత్కరించారు.
అలరించిన కవి సమ్మేళనం
రచయిత ముదిగొండ శాస్త్రి నేతృత్వంలో కవులు రచయితలు చింతలపాటి మురళీకృష్ణ, మేరీకృపాబాయి, డాక్టర్ ఓలేటి ఉమా సరస్వతి, వక్కలంక రామకృష్ణ, సింహాద్రి పద్మ, బత్తిన అగస్తీశ్వరరావుతో కలిసి నిర్వహించిన కవి సమ్మేళనం అలరించింది. విద్యార్థినులు ప్రదర్శించిన కూచిపూడి, భరత నాట్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, బందరు ఆర్డీఓ సాంబశివరావు, రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పి.వి.ఫణికుమార్, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ హసీం బేగ్, బందరు మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచే నాని, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ తదితరులు పాల్గొన్నారు.


