రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరిగిన హత్యాచారాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో మహిళలు, బాలికలపై పెరిగిన హత్యాచారాలు

Mar 15 2026 4:51 AM | Updated on Mar 15 2026 4:51 AM

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని ఏపీ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ అన్నారు. ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు చూపకపోవడం వలన న్యాయస్థానాలు కొట్టివేస్తున్నాయన్నారు. దోషులకు కఠిన శిక్షలు విధించకపోవడంతో మహిళలకు రక్షణ కరువైందన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో శనివారం ఏపీ ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యాన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ మహిళలు, బాలికలపై జరుగుతున్న దాడుల విషయంలో కొన్ని చోట్ల కేసులు నమోదు కావడం లేదన్నారు. ఈ కేసులను విచారించేందుకు ఫాస్ట్‌ ట్రాక్ట్‌ కోర్టు ఏర్పాటు చేసి దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. మహిళా న్యాయమూర్తులను నియమించాలన్నారు. వివక్ష లేకుండా చట్టాలు అందరికీ సమానంగా వర్తింపజేయాలన్నారు. మహిళలు, బాలికలు, గర్భిణులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారన్నారు. ముఖ్యంగా గర్భిణులకు ఐసీడీఎస్‌ ద్వారా అందిస్తున్న పోషకాహారంలో నాణ్యత లేని కారణంగా దానిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారన్నారు. పోషకాహారం స్థానంలో గర్భిణిగా నమోదైన వారికి డీబీటీ ద్వారా నెలకు రూ.6వేల నుంచి రూ. 10వేల వరకు బ్యాంకు ఖాతాకు జమచేయాలని కోరారు. ఒకే రేషన్‌ కార్డులో వృద్ధులు, వితంతువులు ఉంటే వారిలో ఒకరికి మాత్రమే పెన్షన్‌ అందుతోందని, ఈ విధానం సరికాదని.. కార్డులో భర్తను కోల్పోయిన భార్య వితంతు పెన్షన్‌ పొందుతుంటే అదే కార్డులో వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే వారికి పెన్షన్‌ వర్తించేలా మార్పులు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ నాయకులు కె.రాధ, సుజాత, కవిత, రాణి, ప్రశాంతి, సుబ్బమ్మ, వెంకటలక్ష్మి, డప్పు కళాకారుల సంఘం నాయకులు నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు

దండు వీరయ్య మాదిగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement