మొగల్రాజపురం(విజయవాడ తూర్పు):అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రూపదిద్దుకుంటున్న నేపథ్యంలో భౌతిక శాస్త్రంలో విప్లవాత్మకమైన మార్పులకు అవకాశం ఉందని ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్‌డీ.రత్నరాజు చెప్పారు. ఆంధ్రా యూనివర్సిటీ భౌతిక శాస్త్ర పూర్వ విద్యార్థుల క్వాంటమ్ సమిట్ నగరంలోని హోటల్‌లో శనివారం జరిగింది. ఆంధ్రా యూనివర్సిటీ భౌతిక శాస్త్రం రిటైర్డ్ ప్రొఫెసర్లు, పూర్వ విద్యార్థులు ఈ సమిట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రత్నరాజు మాట్లాడుతూ క్వాంటమ్ సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ రంగంలోనే కాకుండా వ్యవసాయం, వైద్యం, జలవనరుల వినియోగం తదితర రంగాల్లో అనేక నూతన ఆవిష్కరణలకు దోహదం చేస్తుందన్నారు. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీలో కేవలం ఒకే ఒక్క ప్రొఫెసర్ తో భౌతిక శాస్త్ర విభాగం నిర్వహణ జరుగుతోందన్నారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఆంధ్ర యూనివర్సిటీ సహా అన్ని యూనివర్సిటీల్లో భౌతిక శాస్త్ర అధ్యాపకుల పోస్టులను తక్షణమే ప్రభుత్వం భర్తీ చేయాలన్నారు. అప్పుడే ప్రభుత్వం ఆశించిన రీతిలో క్వాంటమ్ వ్యాలీలో ఫలప్రదమైన ఫలితాలు వస్తాయన్నారు. సమిట్‌లో ఆంధ్రా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్లు కె.సమత, వి.భాస్కరరావు, వి.వీరయ్య, కె.హనుమంతరావు, డీఎల్.శాస్త్రి, ఎం.పూర్ణచంద్రరావు, కె.చంద్రమౌళి పాల్గొన్నారు


