41 సిలిండర్లు స్వాధీనం
పెనమలూరు: గృహ అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ అక్రమ వినియోగంపై రెవెన్యూ అధికారులు కేసులు నమోదు చేశారు. మండల పరిధిలోని పోరంకి, కానూరు, తాడిగడప ప్రాంతాల్లో పెనమలూరు, మొవ్వ, గుడివాడ, గన్నవరం ప్రాంతాలకు చెందిన డెప్యూటీ తహసీల్దార్‌ల బృందం శనివారం దాడులు చేశారు. గృహావసరాలకు ఉపయోగించాల్సిన వంట గ్యాస్‌ను టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, హోటళ్లు, స్వీట్ షాపులు, వ్యాపార అవసరాలకు వినియోగిస్తుండటంతో 41 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను వ్యాపార అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. గ్యాస్ ఏజెన్సీలు కూడా నిబంధనలు పాటించాలని సూచించారు.
రేపటి నుంచి రైతన్న మీకోసం వారోత్సవాలు
కంకిపాడు /గుడ్లవల్లేరు: కృష్ణాజిల్లా రైతులకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎన్.పద్మావతి శనివారం విలేకరులకు తెలిపారు. జిల్లాలో తిరిగి ఇదే నెలలో 23 నుంచి 25వరకు రైతన్న మీకోసం వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ వ్యవసాయ సహాయకులు, గ్రామ రెవెన్యూ ఆఫీసర్, గ్రామ ఉద్యాన సహాయకులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ తదితర గ్రామ స్థాయి సిబ్బంది పాల్గొంటారని వివరించారు. జిల్లాలోని రైతుల ఇళ్లకు వెళ్లి వారికి ముఖ్యమంత్రి పంపించిన లేఖలోని సందేశాన్ని అందించాలని తెలిపారు.


