భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది విద్య ఒక్కటేనని, దానిని అందించే గురువులు కూడా అంతే శక్తివంతమైనవారని డీసీపీ కేజీవీ సరిత అన్నారు. శనివారం పోరంకి భాష్యం బ్లూమ్స్‌లో బ్లూమ్స్ బ్లూమ్రాంగ్ పేరుతో నిర్వహించిన వార్షికోత్సవాల్లో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి తల్లి, తండ్రి తమ బిడ్డ ఏ విధంగా గురువుల చేతిలో తీర్చిదిద్దబడుతున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో తమ పిల్లలు దానిని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో ఆరా తీయాలని సూచించారు. మరో అతిథి డిపార్ట్‌మెంట్ ఆఫ్ పిడియాట్రిక్ అండ్ ప్రివెంటివ్ డెంటిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ తరన్నుమ్ మాట్లాడుతూ పరీక్షల వేళ విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించి అనుకున్న లక్ష్యాలను సాధించాలని అన్నారు. సభకు భాష్యం ఐఐటీ అకాడమీ ప్రోగ్రామర్ ఆనంద్ అధ్యక్షత వహించగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో కృష్ణాజిల్లా భాష్యం జెడ్‌ఈఓ జోషి, పోరంకి భాష్యం బ్లూమ్స్ ప్రిన్సిపాల్ మహాలక్ష్మి, గుంటూరు భాష్యం బ్లూమ్స్ జెడ్‌ఈఓ అండ్ ప్రిన్సిపాల్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


