క్రీడలతో యువతకు ప్రత్యేక గుర్తింపు
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విద్యతో పాటుగా క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా యువతకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చెప్పారు. సీతారామ గార్డెన్స్‌లో జరుగుతున్న 51వ జాతీయ జూనియర్ కబడ్డీ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం రాత్రితో ముగిశాయి. ఫైనల్స్‌లో జాతీయ క్రీడా ప్రాధికార సంస్థ జట్టు(శాయ్), ఉత్తర ప్రదేశ్ జట్టుపై విజయం సాధించి చాంపియన్ షిప్‌ను కై వసం చేసుకుంది. ముగింపు సభకు బోడే ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు కేవీ ప్రభావతి, ప్రధాన కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ మాట్లాడుతూ నాలుగు రోజులపాటు సాగిన ఈ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయన్నారు. వివిధ ప్రాంతాల నుంచి 450 మంది కబడ్డీ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని ప్రతిభను చూపారన్నారు. ఈ మ్యాచ్‌ల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఎంపిక చేస్తామన్నారు. పారిశ్రామికవేత్త నందమూరి విష్ణువర్థన్ రావు, కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అర్జున్ రావుతో పాటుగా సభ్యులు పాల్గొన్నారు.
కబడ్డీ చాంపియన్‌షిప్ ముగింపు
సభలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్


