రైళ్లన్నీ కిటకిట.. ప్రయాణం కటకట
● ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినా తగ్గని రద్దీ
● జనరల్ కోచ్‌లలో అడుగు పెట్టలేని స్థితి
● ప్రమాదకరంగా ఫుట్‌బోర్డు ప్రయాణం
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): జనాలు మళ్లీ పట్నం బాట పట్టారు. సంక్రాంతి పండుగ ముగియడంతో అందరూ తిరుగుపయనమయ్యారు.
దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేటు బస్సులు, ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల నుంచి మూడు నుంచి అయిదు రెట్లు అధికంగా వసూళ్ల చేసుకుంటూ ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నారు. దీంతో తక్కువ ఖర్చుతో తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్లను ఆశ్రయిస్తున్నారు. పండుగ సమయంలో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని నెలరోజుల నుంచే రిజర్వేషన్‌లు చేయించుకోవడంతో దాదాపుగా ఆయా మార్గాలలో నడిచే రైళ్లన్నీ ఫుల్ అయ్యి భారీగా వెయిటింగ్ లిస్ట్ దర్శనమిస్తోంది. మరికొన్ని రైళ్లలో నోరూమ్ రావడంతో ఊసురుమంటూ ప్రత్యామ్నాయాలను వెతుకుంటున్నారు. కనీసం తత్కాల్ కోటాలో అయినా టికెట్‌లు దొరుకుతాయేమోనని గంటల తరబడి క్యూలైన్‌లో నిలుచుంటున్న వారికి తత్కాల్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే టికెట్‌లు అయిపోవడంతో నిరాశగా వెనుదిరుగుతున్నారు.
విజయవాడ మీదుగా 150కి పైగా ప్రత్యేక రైళ్లు..
సంక్రాంతి పండుగ ముగిసిన అనంతరం తిరుగు ప్రయాణం చేసే ప్రయాణికులతో ఏపీలోని విశాఖ, శ్రీకాకుళం, కాకినాడ, నర్సాపూర్, రాజమండ్రి, విజయవాడ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లు కిటకిటలాడుతున్నాయి. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ మీదుగా ఇప్పటికే 150కి పైగా ప్రత్యేక రైళ్ల, జనసాధారణ్ రైళ్ల(అన్‌రిజర్వడ్)ను నడుపుతోంది. తిరుగు ప్రయాణికుల కోసం ఈ రైళ్లను ఈ నెల 21వరకు పొడిగించి నడుపుతున్నారు. వీటిల్లో కూడా అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రమాదకరంగా జనరల్ కోచ్‌లో ప్రయాణం..
రిజర్వేషన్‌లు దొరకని వారు చేసేది లేక జనరల్ కోచ్‌లను ఆశ్రయిస్తున్నారు. దీంతో సుమారు వందమంది పట్టే జనరల్ కోచ్‌లో మూడు వందల మంది వరకు ప్రయాణికులు ఎక్కుతుండటంతో అందులో కాలు కదపలేని పరిస్థితి నెలకొంటుందని ప్రయాణికులు వాపోతున్నారు. దీంతో లగేజీలు, పిల్లలతో ప్రమాదకరమని తెలిసినా కూడా టాయిలెట్‌లు, ఫుట్‌బోర్డు మెట్ల మీద కుర్చొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
రైళ్లన్నీ కిటకిట.. ప్రయాణం కటకట


