వేర్వేరు చోట్ల చికిత్స పొందుతున్న ఇద్దరి మృతి
ఇబ్రహీంపట్నం: వేర్వేరు చోట్ల చికిత్స పొందుతున్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. కేరళ రాష్ట్రం త్రిశూర్ జిల్లాకు చెందిన బిజు కేపీ(53) ఎన్టీటీపీఎస్‌లోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి. ఈనెల 14న కొండపల్లికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో బీకాలనీ సెంటర్‌లో కారు ప్రమాదానికి గురయ్యాడు. అతన్ని జూపూడిలోని ప్రైవేట్ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. అక్కడ వైద్యశాలలో చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు కేరళలో ఉన్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగించడంతో కేరళకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చిట్టినగర్‌లో..
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కొత్తపేట పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఘటనపై మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదుపై కొత్తపేట పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిట్టినగర్ వలీ వీధికి చెందిన షేక్ సుభాని భార్య, కుమారుడితో ఉంటున్నాడు. సుభానీ ఆటో నడుపుతుంటాడు. ఈ నెల 16న డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన సుభానీ మద్యం తెచ్చుకుని తాగాడు. అదే సమయంలో కుమారుడు కరీముల్లా స్నేహితులతో కలిసి కోడిపందేలు చూడటానికి వెళ్లతానని తండ్రికి చెప్పాడు. చెడు సావాసాలు చేయొద్దని కరీముల్లాను తండ్రి సుభాని మందలించాడు. సాయంత్రం ఇంటి తలుపులన్నీ వేసి ఉండటంతో బాజీ కిటికీ సందులో నుంచి చూడగా, సుభాని లోపల ఫ్యాన్ హుక్‌కు చీరతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. సుభానీని 108లో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయినట్లు వైద్యులు పేర్కొనడంతో బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది.
16 మందికి గాయాలు
హనుమాన్‌జంక్షన్‌రూరల్: బాపులపాడు మండలం కానుమోలు వద్ద 216హెచ్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరి గింది. ఉయ్యూరు నుంచి ద్వారకా తిరుమల వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ సహా 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. దట్టమైన పొగమంచు రహదారిని కప్పేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాలను గుర్తించకపోవమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఆర్టీసీ బస్సు బలంగా లారీని ఢీకొంది. ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని, క్షతగాత్రులకు సాయం అందించారు. వైద్య సాయానికి బాధితులను గుడివాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై జంక్షన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేర్వేరు చోట్ల చికిత్స పొందుతున్న ఇద్దరి మృతి
వేర్వేరు చోట్ల చికిత్స పొందుతున్న ఇద్దరి మృతి


