25న రాజ్యాంగం.. సవాళ్లుపై జాతీయ సదస్సు
కృష్ణలంక(విజయవాడతూర్పు): గవర్నర్‌పేటలోని ఎం.బి.విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 25న జనవిజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర కమిటీ, ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలూ) ఆధ్వర్యాన భారత రాజ్యాంగం–సవాళ్లు అంశంపై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.మాధవరావు పేర్కొన్నారు. గవర్నర్‌పేట రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. ఐలూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరావు మాట్లాడుతూ లాయర్లు, ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులు రాజ్యాంగ ప్రాధాన్యం, గొప్పదనాన్ని సమాజంలోని అన్ని వర్గాలకు తెలియజేసి అవగాహన పెంపొందింపజేయాల్సిన అవసరం ఉందన్నారు. జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్ మాట్లాడుతూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న సదస్సులో భారత రాజ్యాంగం–లౌకికవాదంపై ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, భారత రాజ్యాంగం–ప్రజాస్వామ్య హక్కులుపై ఐలూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సుంకర రాజేంద్రప్రసాద్, భారత రాజ్యాంగం–ఫెడరలిజంపై ప్రొఫెసర్ చక్కా బెనర్జీ, శాసీ్త్రయ దృక్పథం–రాజ్యాంగంపై మాజీ ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం ఉపన్యసిస్తారని తెలిపారు. సమావేశంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, ఏయూ పూర్వ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోటేశ్వరరావు, జేవీవీ కార్యదర్శి బోయి రవి తదితరులు పాల్గొన్నారు.


