ఆరుతడి కోసం పాట్లు
●ఇంజిన్లు, ట్రాక్టర్లతో నీటిని తోడుతూ మినుము పైరును తడుపుతున్న రైతులు
●పురుగు పట్టకుండా గడ్డి మందు పిచికారి
●మినుమును కాపాడుకునేందుకు యత్నం
పెడన: ఆరుతడి పంటలను కాపాడుకోవడానికి రైతులు పాట్లు పడుతున్నారు. రబీలోల రైతన్న ఆరుతడి పంటలను వేసుకున్నాడు. మినుము పైరు బాగా ఏపుగా ఉండటంతో దాన్ని కాపాడుకునేందుకు మరింత అగచాట్లు పడాల్సిన దుస్థితి ఏర్పడింది. కారణం ఆరు‘తడి’ కూడా లేని పరిస్థితులు నెలకొనడమే. ఆయా కాలువల్లో అడుగునీరు, మురుగు కాలువల్లో ప్రవహిస్తున్న స్వీట్‌వాటర్, పంచాయతీ చెరువుల్లోని నీటిని తోడుకుంటూ మినుము పైరును కాపాడుకునే ప్రయత్నాల్లో రైతన్నలున్నారు.
ఆయిల్ ఇంజిన్ల అద్దె భారం
అయిల్ ఇంజిన్ల కోసం రోజుకు రూ.వెయ్యికి పైనే అద్దె చెల్లించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మరికొందరు ట్రాక్టర్లకు మోటారు ఇంజిన్లు ఏర్పాటు చేసి నీటిని తోడుకుంటున్నారు. నలుగురైదుగురు రైతులు వారి పంటలకు ఒక మోటారు ద్వారా తడుపుకొనేలా చూసుకుంటున్నారు. ఎక్కడో దూరంగా ఉన్న కాలువలోని నీటినిగానీ, చెరువులో నీటినిగానీ తోడుకోవాల్సి వస్తే అదనంగా పైపునకు సైతం కిరాయి రూ.వెయ్యికి పైగా చెల్లించాల్సిందే. మరికొందరు స్పేయర్లు ద్వారా నీటిని పోసి తడుపుతున్నారు. స్ప్రేయర్లకు సైతం బాగా గిరాకీ ఏర్పడటంతో డిమాండ్ పెరిగింది.
మినుము పైరుపై చీడ పురుగులు, ఎలుకల దాడి
మినుము పైరు ఆశాజనకంగా ఉందనకుంటున్న తరుణంలో రైతుకు పచ్చపురుగు, లద్దె పురుగు వంటి తదితర చీడ పురుగులతో పాటు మాడుతెగులు, బూజు తెగులు వంటివి సోకుతాయనే భయం రైతులను వెంటాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రైతులు మినుము పైరుకు గడ్డిమందు పిచికారి చేస్తున్నాడు. ఒకసారి పిచికారీ చేసినందుకు రూ.1,500 నుంచి రూ.2 వేలు వరకు ఖర్చు పెడుతున్నారు. మినుము చేతికి వచ్చే వరకు తెగుళ్లు, పురుగులు ఆశించకుండా ఏడు లేదా ఎనిమిది సార్లు పురుగు మందులను పిచికారి చేయాలని రైతులు పేర్కొనడం విశేషం. కొన్ని చోట్ల ఎలుకల బెడద విపరీతంగా ఉండటంతో పొలాల్లో బోన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలుక చిక్కితే ఒక్కోదానికి రూ.25 చెల్లించేలా రైతులు బోన్లు ఏర్పాటు చేసిన వారితో ఒప్పందం చేసుకుని ఎలుకల బెడద నిలువరించు కుంటున్నారు.
ఆరుతడి కోసం పాట్లు


