రసవత్తరంగా సాఫ్ట్ టెన్నిస్ లీగ్
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఏపీ సాఫ్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సౌత్ జోన్ అస్మిత ఖేలో ఇండియా సాఫ్ట్ టెన్నిస్ మహిళల లీగ్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్ విభాగంలో సింగిల్స్, డబుల్స్ పోటీలు ఆదివారం జరిగాయి. సబ్ జూనియర్ సింగిల్స్ విభాగంలో శ్రీమతి (తమిళనాడు) చాంపియన్‌గా నిలిచింది. ఏఎస్ వైశాలి (ఆంధ్రప్రదేశ్) ద్వితీయ, రీత్యా (తమిళనాడు) తృతీయ స్థానాల్లో నిలిచారు. సబ్ జూనియర్ డబుల్స్ విభాగంలో మొదటి సెమీ ఫైనల్‌లో సన్మాతి, రీత్యా (తమిళనాడు) జోడిపై 0–3 తేడాతో శ్రీమతి, అనిల (తమిళనాడు) జోడి విజయం సాధించారు. రెండో సెమీ ఫైనల్‌లో కనిష్ఠ, మధు (తమిళనాడు)జోడిపై 1–3 తేడాతో శృతిలయ, రిషిక (తమిళనాడు) జోడి గెలుపొందారు. జూనియర్స్ డబుల్స్ విభాగంలో మొదటి సెమీ ఫైనల్‌లో జానిని, అక్షిత (తమిళనాడు) జోడిపై 0–3 తేడాతో నిషాలిని, తమిళ్వజి (తమిళనాడు) గెలుపొందారు. రెండో సెమీ ఫైనల్స్‌లో ధరణి, తహ (కర్ణాటక) జోడిపై 2–3 తేడాతో సాధన, నరుమూగయ్ (తమిళనాడు) విజయం సాధించారు. సీనియర్ డబల్స్ విభాగంలో మొదటి సెమీ ఫైనల్స్ సోనికా, నిధి (కర్ణాటక) జోడిపై 0–3 తేడాతో రాగశ్రీ, శ్వేత (తమిళనాడు) విజయం సాధించగా రెండవ సెమీ ఫైనల్స్ లో పూర్వ, శ్రీమతి (తమిళనాడు) జోడిపై 0–3 తేడాతో శరణ్య, అమృతల జోడి గెలుపొందారు. సోమవారం డబుల్స్ విభాగంలో ఫైనల్స్ జరుగుతాయని అనంతరం లీగ్ ముగింపు సభ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.


