ఆహార భద్రతకు అదనపు భరోసా
పటమట(విజయవాడతూర్పు): రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం రూ.20కే కిలో చెక్కి గోధుమపిండి సరఫరా చేస్తోందని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వీసీ, ఎండీ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. విజయ వాడ అర్బన్ మండలంలోని పటమట, ఏపీఐఐసీ కాలనీలోని చౌక ధరల దుకాణంలో కార్డుదారులకు గురువారం చెక్కి గోధుమపిండి పంపిణీ కార్యక్రమాన్ని పౌర సరఫరాల డైరెక్టర్ ఆర్.గోవిందరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ తదితరులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఢిల్లీరావు మాట్లా డుతూ.. నూతన సంవత్సరం ప్రారంభం రోజు ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఆనందంగా ఉందన్నారు. ప్రతినెలా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన 1,850 టన్నుల గోధుమలను తీసుకొని గోధుమపిండి సరఫరాకు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రేషన్ పంపి ణీలో ఏవైనా సమస్యలు ఎదురైతే సంబంధిత అధికారులకు తెలపాలని సూచించారు. కలెక్టర్ లక్ష్మీశ, పౌర సరఫరాల డైరెక్టర్ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ.. జాతీయ ఆహార భద్రత చట్టం, 2013 మార్గదర్శకాలకు అనుగుణంగా లబ్ధిదారులకు వివిధ సరుకులు పంపిణీ చేస్తున్నామని, ఇప్పుడు నాణ్యమైన పోషక సహిత గోధుమపిండిని అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, ఏఎస్‌ఓ శ్రీనివాసులు నాయుడు, జిల్లా డీలర్ల అసోసియేషన్ కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ శివప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


