పట్టుదలతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలి
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె.బాలాజీ సూచించారు. కలెక్టరేట్ సమావేశపు హాలులో కృష్ణా సంకల్పం పేరుతో గురువారం వినూ త్నంగా ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు వివిధ రకాల ప్రయోజనాలు సమకూర్చేందుకు ముస్తాబు కిట్లను, ఉద్యోగులకు వివిధ రకాల ప్రయోజన పత్రాలను కలెక్టర్ పంపిణీ చేశారు. రెవెన్యూ, ఎస్సీ సంక్షేమం, బీసీ సంక్షేమం, వ్యవసాయ, వైద్య – ఆరోగ్య శాఖల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులకు సర్వీసు క్రమబద్ధీకరణ, వార్షిక ఇంక్రిమెంట్లు, బకాయిలు, వేతన నిర్ధారణ మంజూరు పత్రాలను అందజేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ.30 లక్షల విలువైన గల్ఫర్ వాహనాల మంజూరు పత్రాలను ముగ్గురు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. నూతన సంవత్సరం సందర్భంగా బొకేలు, స్వీట్లు, పండ్లు కాకుండా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నోట్‌పుస్తకాలు, ఇతర పరికరాలను జిల్లా అధికారులు అందజేయటం శుభపరిణామమన్నారు. వసతి గృహాల విద్యార్థులకు ఉపయోగపడే బల్లలు, బాలికలకు శానిటరీ నాప్‌కిన్లు, ఇన్‌సినిరేటర్లు, ముస్తాబు కిట్లు అందజేసేందుకు ముందుకొచ్చిన అధికారులను కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం నుంచి మంచి స్పందన వచ్చిందని, జిల్లాలోని 42 వసతి గృహాలకు వీటిని పంపిణీ చేస్తామని తెలిపారు. విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలని, మాద కద్రవ్యాల జోలికి పోకూడదని కష్టపడి చదివి స్తున్న తల్లిదండ్రులకు భారం కాకుండా వారికి సహాయంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్‌జాహిద్, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, కేఆర్‌ఆర్‌సీ స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ శ్రీదేవి, సాంఘిక సంక్షేమశాఖ డెప్యూటీ డైరెక్టర్ షేక్ షాహిద్‌బాబు, జిల్లా బీసీ సంక్షేమాధికారి జి.రమేష్, డీఎంహెచ్‌ఓ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.


