
వైద్య కళాశాలల్లో కొత్త విద్యార్థుల రాక
లబ్బీపేట(విజయవాడతూర్పు): డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం కన్వీనర్ కోటా సీట్లకు సంబంధించి సీట్లు కేటాయించడంతో విజయవాడలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు పొందిన వారు గురువారం ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావును కలసి అడ్మిషన్ పత్రాలు అందజేశారు. ఈ కౌన్సెలింగ్ ద్వారా 149 మంది విద్యార్థులు సిద్ధార్థ వైద్య కళాశాలలో సీట్లు పొందినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏడుకొండలరావు మాట్లాడుతూ టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ కళాశాలను ఎంచుకోవడం తమకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ఇక్కడ ఉన్న మెరుగైన భవనాలు, అత్యాధునిక పరికరాలు, ఆస్పత్రిలో వసతులు, రోగులపై పనిచేసే అవకాశాలు, క్రీడా వసతులు, అత్యుత్తమ బోధన ఇందుకు కారణాలుగా తెలిపారు. వీటికితోడు ఇటీవల విడుదలైన ఐఐఆర్‌ఎఫ్ ర్యాంకింగ్స్‌లో తమ కళాశాల రాష్ట్రంలో ఐదవ స్థానంలో ఉండగా, దక్షిణ భారత దేశంలో 15వ స్థానం, ఆల్ ఇండియా స్థాయిలో 65వ ర్యాంకు పొందినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మెరిట్ విద్యార్థులు సిద్ధార్థను ఎంచుకుంటున్నారన్నారు. భవిష్యత్తులో తమ కళాశాలలో వైద్య విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తామని ఆయన చెప్పారు.
మెరిట్ విద్యార్థులు సిద్ధార్థనే కోరుకున్నారు