దంచింది.. ముంచింది! | - | Sakshi
Sakshi News home page

దంచింది.. ముంచింది!

Aug 29 2025 7:06 AM | Updated on Aug 29 2025 7:06 AM

దంచిం

దంచింది.. ముంచింది!

ఎడతెరిపి లేని వానతో జిల్లా అతలాకుతలం ● తిరువూరు నియోజకవర్గంలో కట్టలేరు, గుర్రపువాగు, పడమటవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. గంపలగూడెం మండల పరిధి వినగడప వద్ద కట్టలేరువాగు ఉద్ధృతికి తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. తిరువూరు మండల పరిధిలోని చౌటపల్లి, జి.కొత్తూరు గ్రామాల మధ్య.. తిరువూరు, అక్కపాలెం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరువూరు, గంపలగూడెం రోడ్డులో చింతలపాడు వద్ద గుర్రపువాగు వరద ఉద్ధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. ● నందిగామ నియోజకవర్గం, నందిగామ మండల పరిధి దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నందిగామ నుంచి చందర్లపాడు వెళ్లే రహదారిపై నల్లవాగు వరద పొంగిపొర్లడంతో సంబంధాలు తెగిపోయాయి. కంచికచర్ల ఆర్టీసీ బస్టాండ్‌లో మోకాళ్లలోతు వర్షపు నీరు నిలిచింది. పలు గ్రామాల పరిధిలో కోతకు వచ్చిన పెసర పంట పాడైపోయింది. వరి, పత్తి పైరు ముంపునకు గురైంది. ● జగ్గయ్యపేట నియోజకవర్గంలో పెనుగంచిప్రోలు, వత్సవాయి మండలాల పరిధిలో తెలంగాణ వైపు నుంచి వచ్చే వరద ప్రవాహంతో మునేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెనుగంచిప్రోలు మండల పరిధిలోని అనిగండ్లపాడు, ముచ్చింతాల గ్రామాలకు వెళ్లే రహదారిపై గండివాగు పొంగిపొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లింగగూడెం నుంచి పెనుగంచిప్రోలు వెళ్లే రహదారిలో అలుగుచొక్కా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో రెండురోజులుగా పక్క గ్రామాలతో సంబంధాలు తెగిపోయాయి. శనగపాడు గ్రామం వద్ద దూళ్లవాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మునేరు పరిధిలోని ఆయకట్టు భూముల్లో ఇటీవల నాట్లు వేసిన వరిపైరు నీట మునిగింది. జగ్గయ్యపేట మండల పరిధి పాలేరు, కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

జిల్లాలో వర్షపాతం వివరాలు..

జిల్లా వ్యాప్తంగా పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

పలు గ్రామాలకు రాకపోకలు బంద్‌

నీట మునిగిన పంట పొలాలు

కృష్ణా నదికి పోటెత్తుతున్న వరద

ప్రకాశం బ్యారేజ్‌ నుంచి 4.16 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి..

నది పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

ఎడతెరిపి లేని వానతో జిల్లా అతలాకుతలం

సాక్షి ప్రతినిధి, విజయవాడ: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు జిల్లాను వణికిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కృష్ణా నది ఎగువ పరీవాహక ప్రాంతాల నుంచి వరద భారీగా వస్తోంది. దీనికితోడు పాలేరు నుంచి 5,660 క్యూసెక్కులు, కీసర నుంచి 27,902 క్యూసెక్కులు, బుడమేరు నుంచి 3,500 క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చి చేరుతోంది. దీంతో మధ్యాహ్నం 2గంటల సమయంలో ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన 69 గేట్లు ఎత్తి 4,16,622 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు మధ్యాహ్నం 3గంటల నుంచి కొంత మేర వరద తగ్గడంతో, శుక్రవారం ఉదయానికి వరద తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నేడు కూడా అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కృష్ణా ఎగువ, దిగువ పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 551 టీఎంసీల నీటిని విడుదల చేశారు. జూలై 20వ తేదీ నుంచి ప్రకాశం బ్యారేజి నుంచి వరద నీటిని నిరంతరాయంగా సముద్రంలోకి విడుదల చేస్తూనే ఉన్నారు.

విజయవాడను వదలని వాన..

బుధవారం వినాయక చవితి పండుగ రోజు ఉదయం బెజవాడలో భారీ వర్షం కురిసింది. నగరంలో వీధులన్నీ జలమయమయ్యాయి. డ్రెయిన్‌లు పొంగి ప్రవహించాయి. ప్రధాన రహదారులన్నీ మోకాళ్లలోతు పైన నీటితో వాగులను తలపించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వినాయక మండపాల వద్దకు నీరు చేరింది. గురువారం తేలికపాటి వర్షాలు కురిశాయి. ఎగువన కురిసిన వర్షాలకు బుడమేరుకు 3,500 క్యూసెక్కుల నీరు వస్తోంది. అయితే డైవర్షన్‌ చానల్‌ ద్వారా ఆ నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు. కొంత మేర వరద పెరిగినా ఇబ్బంది ఏమి ఉందడని నీటి పారుదల శాఖ అధికారులు పేర్కొన్నారు. డైవర్షన్‌ కాలువ ద్వారా 10,500 క్యూసెక్కుల నీటిని మళ్లించే అవకాశం ఉందని తెలిపారు.

జిల్లాలో గడచిన 48 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం నుంచి గురువా రం ఉదయం 8.30 గంటల మధ్య 80.43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

బుధవారం ఉదయం 8.30 గంటలకు..

జగ్గయ్యపేటలో 32.4, చందర్లపాడులో 24.4, పెనుగంచిప్రోలులో 23.4, తిరువూరులో 22.6, మైలవరంలో 18.4, గంపలగూడెంలో 18.2, కంచికచర్లలో 17.6, విజయవాడ ఈస్ట్‌లో 17.2, నార్త్‌లో 17.0, సెంట్రల్‌, వెస్ట్‌లో 16.4 చొప్పున, నందిగామ, జి కొండూరు మండలాల్లో 15.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

గురువారం ఉదయం 8.30 వరకు..

జి. కొండూరులో 152.8, చందర్లపాడులో 123.0, కంచికచర్లలో 98.8, తిరువూరులో 98.4, వీరులపాడులో 96.2, ఏ కొండూరులో 88.4, ఇబ్రహీంపట్నంలో 88.4, గంపలగూడెంలో 87.6, విస్సన్నపేటలో 84.4, రెడ్డిగూడెంలో 78.4, మైలవరంలో 69.2, వత్సవాయిలో 67.8, పెనుగంచిప్రోలులో 67.4, నందిగామలో 64.4, జగ్గయ్యపేటలో 62.4, విజయవాడ రూరల్‌లో 56.8మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

దంచింది.. ముంచింది! 1
1/3

దంచింది.. ముంచింది!

దంచింది.. ముంచింది! 2
2/3

దంచింది.. ముంచింది!

దంచింది.. ముంచింది! 3
3/3

దంచింది.. ముంచింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement