
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
జి.కొండూరు: ఎగువన వర్షాలు పడుతున్న నేపథ్యంలో బుడమేరుకు వరద ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. జి.కొండూరు మండల పరిధి హెచ్.ముత్యాలంపాడు వద్ద చప్టాపై ప్రవహిస్తున్న బుడమేరు వరద ఉద్ధృతిని కలెక్టర్ గురువారం పరిశీలించారు. అనంతరం వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద వరద ప్రవాహాన్ని అధికారులతో కలిసి పరిశీలించి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను అడిగి తెలుసుకున్నారు.
నిరంతర పర్యవేక్షణ..
వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద నిరంతర పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. బుడమేరులో వరద ప్రవాహం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణానదిలోకి వెళ్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందవలసి అవసరం లేదని చెప్పారు. ఒకవేళ వరద ఉద్ధృతి పెరిగి రెగ్యులేటర్ గేట్లు ఎత్తాల్సి వస్తే ముందుగానే సమాచారం అందించి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని వివరించారు. తహసీల్దార్ చాట్ల వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ రామకృష్ణనాయక్, బుడమేరు ఏఈ వెంకటేశ్ పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కృష్ణానదితో పాటు బుడమేరు, మునేరులో ప్రవాహాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ప్రజలు ఆందో ళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. గురువారం కలెక్టర్ లక్ష్మీశ కలెక్టరేట్‌లోని కమాండ్ కంట్రోల్ రూమ్ (సీసీసీ) నుంచి జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కృష్ణా వరద నీటికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని పరీవాహక గ్రామాల ప్రజలకు తెలియజేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 95 గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. కొండ ప్రాంతాల్లో వర్షాలు పడే సమయంలో కొండ చరియలు విరిగి పడే ప్రమాదం ఉన్నందున పునరావాస కేంద్రాలకు రావాలని సూచించారు.
ఏ సహాయం కావాలన్నా..
91549 70454 నంబరుతో కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ఇందులో సమన్వయ శాఖల అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సమాచారం కోసమైనా, సహాయానికైనా కమాండ్ కంట్రోల్ కేంద్రానికి ఫోన్ చేయొచ్చని సూచించారు.