
ఇద్దరు యువకుల ప్రాణాలు కాపాడిన పోలీసులు
వరదలో కొట్టుకుపోయిన బైక్
పెనుగంచిప్రోలు: మునేరు వరదలో చిక్కుకున్న యువకులను స్థానికుల సహకారంతో పోలీసులు కాపాడిన ఘటన మండల కేంద్రం పెనుగంచిప్రోలులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన రేలా సుధాకర్, నందిగామ మండలం చెర్వుకొమ్ముపాలెం గ్రామానికి చెందిన మార్కాపురపు సురేష్ తిరుపతమ్మవారి దర్శనానికి పెనుగంచిప్రోలు వచ్చారు. అనంతరం మునేరు అవతల నుంచి కాజ్‌వేపై పెనుగంచిప్రోలు వైపు వస్తుండగా ప్రమాదవశాత్తూ బైక్‌తో సహా మునేరు వరద నీటిలో పడిపోయారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే కాజ్‌వేకు పక్కన ఉన్న పైపును పట్టుకున్న వారిని రోప్ సాయంతో బయటకు తీశారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉన్నా యువకులు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే వారి బైక్ మాత్రం వరద నీటిలో కొట్టుకుపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో యువకులు మద్యం తాగి ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వరద ఎక్కువగా ఉన్న కారణంగా జాగ్రత్తగా ఉండాలని ఎస్‌ఐ అర్జున్ సూచించారు.