
● అవ్వ స్థైర్యం ముందు వాన దిగదుడుపే
ఈ చిత్రం చూస్తుంటే శ్రీశ్రీ మహాప్రస్థానంలో భిక్షువర్షీయసి కవిత గుర్తొస్తుంది కదూ.. దారిపక్క చెట్టుకింద, ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసల్దొకతె.. మూలుగుతూ.. ముసురుతున్న ఈగలతో వేగలేక.. ముడతలు తేరిన దేహం.. రానున్నది చలికాలం.. దిక్కులేని దీనురాలు.. అంటూ ఆ కవితలో రోడ్డు పక్క బిచ్చగత్తె గురించి శ్రీశ్రీ హృదయవిదారకంగా రాశారు. ఈ చిత్రంలో ముసలమ్మ బిచ్చగత్తె కాదు.. ఆత్మాభిమానం ఉన్న ముసలమ్మ.. ఈ వయసులో కూడా ఎవరిపై ఆధారపడకుండా కష్టపడి సంపాదించి తన కష్టంతోనే బతికే మహిళ. వినాయకచవితి నాడు వర్షంలో తడుస్తూ కూడా రోడ్డుపై మునగదీసుకుని కూర్చుని పత్రి కొనే వారి కోసం ఆశగా ఎదురుచూస్తోంది. విజయవాడ పటమట హైస్కూల్ రోడ్డులో ఈ దృశ్యం కనిపించింది. – ఆటోనగర్(విజయవాడ తూర్పు)