
5న ఏకపాత్రాభినయ పోటీలు
విజయవాడ కల్చరల్: శ్రీరామకృష్ణా నాట్యమండలి(సాంస్కృతిక సేవా సంఘం) వార్షికోత్సవం సందర్భంగా బాల బాలికల్లోని ప్రతిభను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి ఏకపాత్రాభినయ పోటీలను వచ్చేనెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి జొన్నలగడ్డ శ్రావణ్‌కుమార్ తెలిపారు. గాంధీనగర్‌లోని సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. కౌతా పూర్ణానందం కళావేదిక వేదికగా జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు ఉంటాయని చెప్పారు. పౌరాణికం, సాంఘికం, చారిత్రక అంశాలను పోటీదార్లు ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. సంబంధిత పోస్టర్‌ను అతిథులు ఆవిష్కరించారు. సమావేశంలో రంగస్థల ప్రముఖులు డాక్టర్ పీవీఎన్ కృష్ణ, డాక్టర్ జొన్నలగడ్డ జగన్మోహనరావు, చింతా వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రవేశ రుసుం ఏమీ లేదని, పేర్ల నమోదుకు చివరి తేదీ వచ్చేనెల 2వ తేదీ అని చెప్పారు. జూనియర్ విభాగంలో ప్రథమ బహుమతి రూ.2,000, ద్వితీయ రూ. 1,500, తృతీయం రూ. 1000, సీనియర్ విభాగంలో మొదటి బహుమతి రూ. 5,116, ద్వితీయ రూ. 3,116, తృతీయ రూ. 2,116 నగదు అందజేస్తారని చెప్పారు. మరిన్ని వివరాలకు 85006 42543, 83747 60657లో సంప్రదించాలని సూచించారు.
ఆస్పత్రుల్లో ఫీజు బోర్డులు ఏర్పాటు చేయండి
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలోని ప్రైవేటు హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్, క్లినిక్స్, లేబొరేటరీలు, స్కానింగ్ సెంటర్లలో వారు వసూలు చేసే ఫీజుల వివరాలతో కూడిన పట్టికలు రిసెప్షన్ వద్ద కనిపించేలా బోర్డులు పెట్టాలని ఎన్టీఆర్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ మాచర్ల సుహాసిని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ ధరల పట్టికను ప్రజలకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని, అదే విధంగా జిల్లాలో ఉన్న ప్రతి స్కానింగ్ సెంటర్ పీసీ–పీఎన్‌డీటీ యాక్ట్ 1994 ప్రకారం స్కాన్ చేసే రూం బయట, లోపల ఐఈసీ మెటీరియల్ తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని తెలిపే బోర్డును తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ఆస్పత్రి తప్పనిసరిగా ఫైర్ ఎన్‌ఓసీ కలిగి ఉండాలని, ఆ సర్టిఫికెట్ గడువు తేదీ ముగిస్తే వెంటనే తిరిగి రెన్యువల్ చేయించుకోవాలన్నారు.
అవసరం లేని ఎక్స్‌రే, స్కానింగ్‌లను నివారించాలి
లబ్బీపేట(విజయవాడతూర్పు): అవసరం లేని ఎక్స్‌రేలను నివారించాలని, ఇమేజింగ్‌ను న్యాయంగా ఉపయోగించాలని విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్–ఏడీఎంఈ డాక్టర్ ఎ. వెంకటేశ్వరరావు అన్నారు. నగరంలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో ఆదివారం ఆర్థోపెడిక్ జోనల్ సీఎంఈ(కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్) జరిగింది. ‘ఇమేజింగ్ ఇన్ ఆర్థోపెడిక్స్’ అనే అంశంపై జరిగిన ఈ సదస్సును వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావుతో కలిసి జీజీహెచ్ సూపరింటెండెంట్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఐ, పిన్నమనేని సిద్ధార్థ, ఆశ్రమ్, నిమ్రా, సిద్ధార్థ వైద్య కళాశాలల నుంచి 150 మంది ఆర్థోపెడిక్ పోసు్ట్రగాడ్యుయేషన్ విద్యార్థులు పాల్గొన్నారు. సదస్సులో 12 శాసీ్త్రయ అంశాలపై నిపుణులు విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. ముఖ్యంగా ఎంఆర్‌ఐ స్కానింగ్ ద్వారా బోన్ ట్యూమర్లు, స్పైన్ సమస్యలను గుర్తించడంపై చర్చించారు. కార్యక్రమంలో ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ ఎ శ్రీనివాసరావు, పరిశీలకుడిగా ఎనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ ఎస్. వినయ్‌కుమార్ వ్యవహరించారు.
ముగిసిన క్యారమ్
ర్యాంకింగ్ పోటీలు
మధురానగర్(విజయవాడసెంట్రల్): చుట్టుగుంట బీఎస్‌ఎన్‌ఎల్ భవన్ టెలికాం రిక్రియేషన్ క్లబ్‌లో ఎస్. అంజారావు మెమోరియల్ ఎన్టీఆర్ జిల్లా ప్రథమ క్యారమ్ ర్యాంకింగ్(పురుషులు, సీ్త్రల) పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీలలో పురుషుల విభాగంలో వరుసగా వి. శ్రీనివాసరావు, ఎస్. శ్రీను బాబు, వై. మురళి, కె. సుజన్ కుమార్, ఎస్‌కే హుస్సేన్, సీహెచ్ శ్యాంప్రకాష్ ర్యాంకులు సాధించారు. అలాగే మహిళల విభాగంలో వరుసగా అమృత కుమారి, వి. కూర్మిళ, టి. తనూజ, రామ్‌కుమారి, ఎన్. నిర్మల, స్వాతి ర్యాంకింగ్ సాధించారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.