
ప్రజారోగ్యం ప్రభుత్వ బాధ్యత
ప్రొఫెసర్ జి.వి.ఎస్.మూర్తి
కృష్ణలంక(విజయవాడతూర్పు): వైద్యరంగం ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పుడే సాధారణ ప్రజలకు మెరుగైన వైద్యం అంది మేలు జరుగుతుందని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ టాపికల్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ జి.వి.ఎస్.మూర్తి అన్నారు. ప్రజా ఆరోగ్యం బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. విజయవాడ ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ప్రజా ఆరోగ్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ కె.వి.ఎస్.సాయిప్రసాద్ అధ్యక్షతన ఆదివారం జాతీయ స్థాయి ఆరోగ్య సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ జి.వి.ఎస్.మూర్తి పాల్గొని వైద్యరంగ ప్రైవేటీకరణ–పరిణామాలు అనే అంశంపై మాట్లాడారు. వైద్య రంగ ప్రైవేటీకరణ ద్వారా సాధారణ ప్రజానీకానికి మెరుగైన వైద్యం అందినట్లుగా ప్రపంచంలో ఎక్కడా రుజువు కాలేదన్నారు. ప్రాథమిక వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినప్పడే సాధారణ ప్రజలు జబ్బునపడే అవకాశం తక్కువగా ఉంటుందని, జబ్బుల కోసం పేదవారు పెట్టుకునే జేబు ఖర్చు తగ్గుతుందని పేర్కొన్నారు.
పెరుగుతున్న క్యాన్సర్ కేసులు..
క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ డి.రఘునాథరావు మాట్లాడుతూ.. దేశంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్లు రావడానికి ప్రధానమైన కారణం పొగాకు వాడకమని, పొగాకును ఏ రూపంలో వాడినా దానివల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. క్యాన్సర్ స్పెషలిస్ట్ అయిన డాక్టర్ డి.లీల మాట్లాడుతూ మహిళలకు వచ్చే క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్లు చాలా ప్రధానమైనవని, వీటిని చాలా వరకు నివారించుకోవచ్చని సూచించారు. అనంతరం క్యాన్సర్‌ను ముందుగా గుర్తించే పద్ధతులు, నివారణ మార్గాలకు సంబంధించిన పుస్కకాన్ని ఆవిష్కరించారు. సదస్సులో ప్రజారోగ్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎం.వి.రమణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కామేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయ్ ప్రకాష్, అధ్యక్షుడు డాక్టర్ మాకినేని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.