
ఉత్సాహంగా ‘సండేస్ ఆన్ సైకిల్’
లబ్బీపేట(విజయవాడతూర్పు): సైకిల్ తొక్కుదాం.. ఆరోగ్యంగా జీవిద్దాం.. అంటూ ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ఆదివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్‌పై గడిపే అరగంట సమయం మన జీవిత కాలాన్ని పెంచుతుందనే సందేశంతో, వ్యాయామం అనేది మందు కాదని, కానీ ప్రతిరోజూ చేస్తే మందుల అవసరం ఉండదనే నినాదంతో ర్యాలీ చేశారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ‘సండేస్ ఆన్ సైకిల్’ పేరుతో నిర్వహించిన ఈ ర్యాలీని డీసీపీ ఎస్‌వీడీ ప్రసాద్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. వ్యాస్ కాంప్లెక్స్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పోలీస్‌కంట్రోల్ రూమ్ వరకూ వెళ్లి, తిరిగి బెంజిసర్కిల్ మీదుగా వ్యాస్ కాంప్లెక్స్‌కు చేరుకున్నారు.
చురుకుగా లేకుంటే అనారోగ్యాలు..
ఈ సందర్భంగా డీసీపీ ప్రసాద్ మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవన శైలిలో నిత్యం ద్విచక్రవాహనాలు, కార్లలో ప్రయాణించడం ఒక అలవాటుగా మారిందన్నారు. ఆధునిక సౌకర్యాలతో జీవనం సాగిస్తున్నప్పటికీ, శారీరక చురుకుదనం లేకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయన్నారు. అందుకోసం ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు సైకిల్ తొక్కడం ద్వారా శరీరానికి అవసరమైన వ్యాయామం లభిస్తుందని పేర్కొన్నారు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతో పాటు, ఊబకాయం, మధుమేహం వంటి అనేక రకాల సమస్యలను నివారిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ ఏడీసీపీ కె. కోటేశ్వరరావు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
పోలీసుల సైకిల్ ర్యాలీని ప్రారంభించిన డీసీపీ ప్రసాద్